విమానంలో కొట్టుకున్న భార్య భర్త: విషయం ఎక్కడి దాకా వెళ్లిందంటే..?
భార్యభర్తలు గొడవ పడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు.. తన్నుకున్నారు. ఎగబడి కొట్టుకున్నారు. అక్కడా ఇక్కడా కాదు.. ఏకంగా భూమికి సుమారు 32,000 మీటర్ల ఎత్తున ఎగురుతున్న విమానంలో. ఫ్లైట్ క్రూ వారిని వారించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ఒకదశలో వారిపైనా చేయి చేసుకునేంత పరిస్థితి తలెత్తింది.
భారత గగనతలం మీదుగా మ్యునిచ్ నుంచి బ్యాంకాక్ వెళ్లే లుఫ్తాన్సా విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యూనిచ్ ఎయిర్ పోర్ట్ నుంచి మంగళవారం బయలుదేరిన ఫ్లైట్ నంబర్ ఎల్ హెచ్ 772 ఫ్లైట్.. ఈ సాయంత్రం 4:30 గంటలకు బ్యాంకాక్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది.

మార్గమధ్యలో భారత గగనతలంలోకి ప్రవేశించిన సమయంలో విమానంలో ఉన్న భార్యభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తొలుత వాగ్వివాదానికి దిగారు. ఫ్లైట్ సిబ్బంది, తోటి ప్రయాణికులు జోక్యం చేసుకున్నప్పటికీ వారు వినిపించుకోలేదు. ఇద్దరూ గొడవ పడ్డారు. ఘర్షణకు దిగారు.
దీనితో ఈ విమానాన్ని పైలెట్లు దారి మళ్లించాల్సి వచ్చింది. నేరుగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ దంపతులిద్దరినీ ఢిల్లీలో దించేసి మళ్లీ ఈ ఫ్లైట్ బ్యాంకాక్ వెళ్తుందని తెలుస్తోంది. న్యూసెన్స్ కేసు కింద వారిని ఢిల్లీ విమానాశ్రయం పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.
గతంలో ఇలాంటి సంఘటనే ఇండిగో విమానంలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జైపూర్ నుంచి బెంగళూరు విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందిపై దౌర్జన్యానికి దిగాడు. వారిని బెదిరించాడు. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications