భారత్ సత్తాకు ప్రపంచ దేశాలు సలాం: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపునకు సహకారం: మోడీ
లక్నో: అయిదో విడత ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవ్వాళ కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి పోలింగ్ ముగుస్తుంది. ఇంకో రెండు దశల పోలింగ్ పూర్తి కావాల్సి ఉంది. ఆరో విడత పోలింగ్ గురువారం జరుగనుంది. 5వ తేదీన మణిపూర్‌లో రెండో విడత, 7న ఉత్తర ప్రదేశ్‌లో చివరి దశ పోలింగ్ ఉంటుంది. ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 10వ తేదీన వెల్లడవుతాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరో.. ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యేదెవరో తేలేది ఆ రోజే.
ఆరో విడత అసెంబ్లీ ఎన్నికల కోసం ఇదివరకే ప్రచారం పరిసమాప్తి అయింది. ఏడో విడత కోసం అన్ని పార్టీలు దృష్టి సారించాయి. విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నాయి. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తోన్నారు. ఇవ్వాళ ఆయన రాబర్ట్స్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలను వివరించారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను స్వదేశానికి తీసుకుని వస్తున్నామని మోడీ అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ గంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇదివరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకుని వచ్చామని గుర్తు చేశారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేయడానికి నలుగురు కేంద్రమంత్రులను ప్రత్యేకంగా నియమించామని చెప్పారు.
ఉక్రెయిన్‌లో ఇంకా చాలామంది భారతీయులు చిక్కుకుని ఉన్నారని, వారిని తీసుకుని రావడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని మోడీ చెప్పారు. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పూర్తిస్థాయి సమాచారాన్ని తెప్పించుకుంటున్నామని, భారతీయు వివరాలను తెలుసుకుని- వారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశామని వివరించారు. గతంలో వందేభారత్ మిషన్ తరహాలో ఇప్పుడు ఆపరేషన్ గంగాను నిర్వహిస్తున్నామని అన్నారు.

ఉక్రెయిన్ నుంచి చిట్టచివరి భారతీయుడిని సురక్షితంగా స్వదేశానికి తరలించేంత వరకూ ఆపరేషన్ గంగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ తరలింపును ముమ్మరం చేయడానికి సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానాలను రంగంలోకి దించామని చెప్పారు. వచ్చే రెండు మూడు రోజుల్లో 26 విమానాల ద్వారా ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి భారతీయుల తరలింపు ఉంటుందని మోడీ స్పష్టం చేశారు. తాము చేపట్టిన చర్యల గురించి అన్ని దేశాలు ప్రశంసిస్తోన్నాయని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications