చంద్రబాబు, నితీష్ కోసమే ఆ బిల్లు.. ! కేంద్రంపై విపక్షం షాకింగ్..!
క్రిమినల్ కేసుల్లో అరెస్టు అయి 30 రోజులు జైల్లో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రుల్ని వారి పదవుల నుంచి ఆటోమేటిగ్గా తొలగించేందుకు వీలుగా కేంద్రం తీసుకువచ్చిన బిల్లు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. దీన్ని తప్పుబడుతూ ఇవాళ కూడా పార్లమెంట్ ను విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త వాదనను కూడా విపక్ష ఇండియా కూటమి తెరపైకి తెచ్చింది. దీంతో కేంద్రం ఆత్మరక్షణలో పడుతోంది.
అరెస్టు అయిన సీఎంలు, మంత్రులు, ప్రధానిని సైతం 30 రోజులు జైల్లో ఉంటే పదవుల నుంచి తొలగించేందుకు వీలుగా నిన్న హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల మధ్య దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. అయితే ఇవాళ కూడా ఈ బిల్లుపై విపక్షాలు మండిపడ్డాయి. నిన్న ఈ బిల్లు విపక్ష ముఖ్యమంత్రులు, మంత్రుల్ని టార్గెట్ చేసేందుకు అని ఆరోపించిన విపక్షాలు.. ఇవాళ ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములైన చంద్రబాబు, నితీష్ కుమార్ ను టార్గెట్ చేసేందుకే అని ఆరోపించాయి.

ఈ బిల్లు విపక్ష పార్టీల ప్రభుత్వాల్ని, మంత్రుల్ని టార్గెట్ చేసేందుకు తెచ్చారని, అలాగే చంద్రబాబు, నితీష్ కుమార్ వంటి ప్రాంతీయ ఎన్డీయే భాగస్వాముల్ని టార్గెట్ చేసేందుకు తెచ్చారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఈ ఆరోపణల్ని అధికార బీజేపీ ఎంపీలు తిప్పికొట్టారు. ఇవాళ పార్లమెంట్ సమావేశాల చివరి రోజు కావడంతో విపక్షాల నిరసనల మధ్యే సభను స్పీకర్ ఓం బిర్లా నిరవధికంగా వాయిదా వేశారు.

మరోవైపు బీహార్ అసెంబ్లీలో విపక్ష నేత తేజస్వీ యాదవ్ సైతం కేంద్రం తెచ్చిన బిల్లు నితీష్ కుమార్ ను బెదిరించి తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే అని ఆరోపించారు. బీహార్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, ముఖ్యమంత్రుల్ని బెదిరించి వేధించేందుకే ఈ బిల్లును కేంద్రం తెచ్చిందన్నారు. ఎందుకంటే వీరిద్దరూ లేకుండా ఎన్డీయేకు లోక్ సభలో మెజార్టీ లేదన్నారు. బీహార్ ఎన్నికలకు ముందు కేంద్రం ఇస్తున్న సందేశం ఇది అన్నారు. ముఖ్యంగా మనీలాండరింగ్ కేసుల్లో నిందితుల పిటిషన్లను ఈడీ కోర్టు కొట్టేస్తే వారిని జైలుకు పంపి పదవుల నుంచి తప్పించడమే దీని ఉద్దేశమన్నారు.












Click it and Unblock the Notifications