ప్రధాని మోదీకి ఫోన్ కాల్
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 27 మంది కన్నుమూశారు. పలువురు పర్యాటకులు, స్థానికేతరులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే భారీగా సైన్యం సంఘటన స్థలానికి తరలి వెళ్లింది.
అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామ్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన సంభవించింది. వేసవి సీజన్ కావడం వల్ల జమ్మూ కాశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. ఎడ తెరిపి లేకుండా అక్కడ మంచు కురుస్తోంది. మంచుకొండల అందాలను తిలకించడానికి వచ్చే సందర్శకులతో అక్కడి పర్యాటక ప్రాంతాలన్నీ కూడా పోటెత్తుతున్నాయి. హిల్ స్టేషన్ పహల్‌గామ్‌లో రద్దీ మరింత అధికంగా ఉంటోంది.

ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కాల్పులకు తెగబడ్డారు. ఈ మధ్యాహ్నం పహల్‌గావ్‌లో రెండు పర్యాటక బృందాలపై ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 27 మంది కన్నుమూశారు. పహల్‌గామ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందిన వెంటనే భద్రత బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.
ఏడుమంది ఉగ్రవాదులు ఈ కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు తెలియజేశారు. అతి సమీపం నుంచి అతను పర్యాటకులపై కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ ఘటన పట్ల జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ ఘటన పట్ల అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనను కుదించుకున్నారు. హుటాహుటిన భారత్‌కు బయలుదేరారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శ్రీనగర్‌కు బయలుదేరి వెళ్లారు. పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
ఈ కిరాతక చర్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, న్యూజిలాండ్ విదేశాంగ శాఖ మంత్రి విన్‌స్టన్ పీటర్స్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటొని అల్బనీస్, బ్రిటన్ ప్రధానమంత్రి కీత్ స్టార్మర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోదీకి స్వయంగా ఫోన్ చేశారు. పహల్గామ్‌లో జరిగిన ఇస్లామిక్ ఉగ్రవాద దాడి బాధితులకు సంతాపం తెలియజేశారు. ఈ దాడిని ఆయన ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రజల వెంట ఉంటామని తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతలో అన్ని రకాలుగా సహకరిస్తామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఈ కష్ట సమయంలో భారత్‌కు అండగా నిలిచినందుకు ట్రంప్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. హేయమైన ఉగ్ర దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను న్యాయస్థానాల ముందు నిలబెట్టడానికి దృఢ సంకల్పంతో ఉన్నామని మోదీ అన్నారు.












Click it and Unblock the Notifications