నూపుర్ శర్మను హతమార్చేందుకు భారీ కత్తితో బోర్డర్ దాటిన పాకిస్థానీ, అరెస్ట్
న్యూఢిల్లీ: బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మను హత్య చేసేందుకు పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీగంగానగర్ జిల్లాలో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) , ఇతర నిఘా సంస్థలు ఆ పాకిస్థాన్ జాతీయుడ్ని విచారిస్తున్నాయి.
జులై 16న రాత్రి 11 గంటలకు హిందుల్కోట బోర్డర్ ఔట్ పోస్టు వద్ద పాక్ జాతీయుడ్ని అరెస్ట్ చేసినట్లు ఓ సీనియర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారి వెల్లడించారు. అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

అంతేగాక, ఆ పాక్ జాతీయుడి వద్ద 11 ఇంచుల పొడవైన కత్తి, ఇతర మతపరమైన పుస్తకాలు, బట్టలు, ఆహారం, ఇసుక లభించినట్లు అధికారులు వెల్లడించారు. అతడ్ని పాకిస్థాన్‌లోని నార్తెర్న్ పంజాబ్‌లోని మండి బహౌద్దిన్ సిటీకి చెందిన రిజ్వాన్ అష్రఫ్‌గా గుర్తించారు.
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను హత్య చేసేందుకు తాను భారతదేశంలోకి వచ్చినట్లు అష్రఫ్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. నూపుర్ శర్మను హత్య చేయాలని నిర్ణయించుకున్న రిజ్వాన్ అష్రఫ్.. అంతకుముందే మొదట అజ్మీర్ దర్గాను సందర్శించాలనుకున్నాడు.
అష్రఫ్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. ఎనిమిది రోజుల పోలీసుల కస్టడీ విధించారు. ఇతని గురించి దర్యాప్తు, నిఘా సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అష్రఫ్‌ను ప్రస్తుతం ఐబీతోపాటు రా, మిలిటరీ నిఘా సంస్థలు విచారిస్తున్నాయి.












Click it and Unblock the Notifications