భారత్‌పై పాకిస్తాన్ బరితెగింపు-
India Pakistan War: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి.
ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ బరితెగిస్తోంది. తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. నిన్నటి వరకూ జమ్మూ కాశ్మీర్ సమీపంలో నియంత్రణ రేఖ (LoC) పొడవునా కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్ సైన్యం.. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసింది. భారత అంతర్జాతీయ సరిహద్దు పొడవునా కాల్పులు జరిపింది.

తేలికపాటి ఆయుధాలతో పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరిపారు. జమ్మూ జిల్లా పర్గ్‌వాల్ సెక్టార్, రాజౌరి జిల్లాలోని సుందర్‌బనీ, నౌషేరా, అఖ్నూర్ సెక్టార్ల పరిధిలో అంతర్జాతీయ సరిహద్దు పొడవునా గల భారత ఆర్మీ పోస్టులపై పాకిస్తాన్ ఈ కాల్పులు జరిపింది. దీన్ని భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పి కొట్టారు. పాకిస్తాన్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పారు.
ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులు ధృవీకరించారు. జమ్మూ కాశ్మీర్‌లో నాలుగు జిల్లాల అంతర్జాతీయ సరిహద్దుల్లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు. ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా పాకిస్తాన్ సైన్యం కాల్పులకు దిగిందని, దీన్ని భారత జవాన్లు తిప్పి కొట్టారని అన్నారు.
ఈ నెల 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పహల్గామ్ ఘటన తరువాత ఎల్‌ఓసి వెంట పాకిస్తాన్ కాల్పులు జరపడం వరుసగా ఇది ఆరోసారి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వస్తోంది.
ఈ పరిస్థితుల్లో నౌషేరా, సుందర్‌బనీ, అఖ్నూర్ సెక్టార్ల పరిధిలో నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల పొడవునా పాకిస్తాన్ ఆర్మీ ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా తేలికపాటి ఆయుధ కాల్పులు తెగబడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సంయమనాన్ని పాటిస్తోన్న భారత సైన్యాన్ని రెచ్చగొట్టినట్టయింది.
మొదట్లో కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో కాల్పులు ప్రారంభం అయ్యాయి. అనంతరం పూంచ్, అఖ్నూర్ సెక్టార్లకు వ్యాపించాయి. క్రమంగా రాజౌరి జిల్లాలోని సుందర్‌బని, నౌషేరా సెక్టార్లల్లో దీని ఉధృతి కనిపించింది. దీని తరువాత జమ్మూలోని పర్గ్‌వాల్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.
భారత- పాకిస్తాన్ 3,323 కిలో మీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోన్నాయి. ఇందులో అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్ నుండి జమ్మూలోని అఖ్నూర్ వరకు దాదాపు 2,400 కిలో మీటర్లు. జమ్మూ నుండి లఢక్ రాజధాని లేహ్ వరకు 740 కిలో మీటర్ల మేర నియంత్రణ రేఖ పంచుకుంటోంది. సియాచిన్ ప్రాంతంలో 110 కిలోమీటర్ల యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ ఉన్నాయి.












Click it and Unblock the Notifications