యుద్ధం ఆపాలని పాక్ అడుక్కుంది.. ట్రంప్ చెప్పలేదు : ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో జరిగిన చర్చలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. పహల్గాం ఎటాక్, ఆపరేషన్ సింధూర్ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదన్నారు. అలాంటి సమయంలో భారత్ కు ప్రపంచ దేశాలు అండగా నిలిచాయని కానీ దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ మాత్రం ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదని మండిపడ్డారు. అంతకుముందు లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబితేనే భారత్ యుద్ధం ఆపేసిందన్నారు. పాక్ విజ్ఞప్తి మేరకు యుద్ధాన్ని ఆపామని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు.
అయితే ఇండియా కూటమి నేతల వ్యాఖ్యలకు ప్రధాని మోదీ బదులిచ్చారు. భారత్ దాడులకు పాకిస్థాన్ తట్టుకోలేక కాళ్ల బేరానికి వచ్చిందని తెలిపారు. తమపై దాడి చేయకండి అని.. తీవ్రంగా నష్టపోయాం.. ఇక తట్టుకునే శక్తి తమకు లేదని యుద్ధం ఆపండి అని పాకిస్థాన్ డీజీఎమ్ఓ కి ఫోన్ చేసి పాకిస్థాన్ అడుక్కుంది అని ప్రధాని మోదీ తెలిపారు. అదే సమయంలో మే 9న యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తమకు ఫోన్ చేసి పాకిస్థాన్ భారీ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపారు. అయితే పాక్ ఏం చేసినా తాము చూసుకుంటామని, బారీ మూల్యం చెల్లించుకుంటుందని తెలిపామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా విజయ్ ఉత్సవ్‌ను దేశం మొత్తం జరుపుకుంటోందని వెల్లడించారు. టెర్రరిస్టుల హెడ్ క్వార్టర్స్ ను ధ్వంసం చేసినందుకు.. సింధూర్ శపథాన్ని నెరవేర్చినందుకు ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. టెర్రర్ క్యాంపులను మట్టిలో కలిపేశామని తెలిపారు. టెర్రరిస్టులు చేసిన దాడి క్రూరత్వానికి ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు.
అయితే అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రభుత్వ పెద్దలు సైనికుల చేతులు కట్టేశారని ఆరోపించారు. పాక్ విజ్ఞప్తి మేరకు యుద్ధాన్ని ఆపామని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో సైనికుల చేతులు కట్టివేశారు. అర్థరాత్రి 1.35 కు పాకిస్థాన్ తో మాట్లాడామని రాజ్‌నాథ్ చెప్పారు. దాడి ప్రారంభించి కేవలం 30 నిమిషాల్లోనే పాకిస్థాన్ కు భారత్ లొంగిపోయింది.
ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని పాక్ తో చెప్పామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అంటే పాకిస్థాన్ తో పోరాడే ఆలోచన లేదని రాజ్ నాథ్ పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారు. యుద్ధ విమానాలను నష్టపోయామని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. పాక్ సైనిక స్థావరాలపై దాడి చేయలేదని అనిల్ చౌహాన్ చెప్పారు.. అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ దీనికి సమాధానం ఇస్తూ.. కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాలకు స్వేచ్ఛను ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్ ను ఆపలేదని ప్రధాని మోదీ లోక్‌సభ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. అణు బ్లాక్ మెయిలింగ్ కు భారత్ తలవంచదని స్పష్టం చేశారు.

జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. ఈ విషయాన్ని భారత రక్షణశాఖ ఆ సమయంలో అధికారికంగా వెల్లడించింది.












Click it and Unblock the Notifications