కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..! కీలక సవరణలివే..!
దేశంలో పన్ను గణనను సరళీకృతం చేసే లక్ష్యంతో రూపొందించిన కొత్త ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లును కేంద్రం ఇవాళ పార్లమెంట్ లో ఆమోదించింది. ఇప్పటికే తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లును తాజాగా ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. నిన్న లోక్ సభలో, ఇవాళ రాజ్యసభలో కొత్త బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు వ్యక్తులు, కార్పోరేషన్లు రెండింటికీ దీర్ఘకాలిక ఆదాయపు పన్ను చట్టాన్ని వర్తింపచేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో రెండు ద్రవ్య బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఇందులో ఆదాయపు పన్ను బిల్లు
2025, అలాగే పన్ను చట్టాలు (సవరణ) బిల్లు 2025 ఉన్నాయి. దీంతో ఈ రెండు బిల్లుల్ని రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అనంతరం ఈ బిల్లుల్ని తిరిగి లోక్ సభకు పంపారు. దీంతో పార్లమెంట్ ఉభయసభలు కొత్త ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లుల్ని ఆమోదించినట్లయింది.

1961 నాటి ఆదాయపు పన్ను చట్టంలో కొన్ని భాగాలు కాలం చెల్లిపోయాయని, అందుకే ఈ కొత్త చట్టం అవసరమైందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు తెలిపారు. వాస్తవానికి లోక్ సభలో ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. అయితే బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ ఈ బిల్లుకు పలు మార్పులు సూచించింది. దీంతో తాజాగా ఈ బిల్లును లోక్ సభలో ఉపసంహరించి తిరిగి ప్రవేశపెట్టి మార్పులతో మోదించారు.
సెలెక్ట్ కమిటీ చేసిన సిఫార్సుల్లో ఆస్తి వార్షిక విలువ గణనపై క్లారిటీ, ఇంటి ఆస్తి ఆదాయం నుండి తగ్గింపులు, పెన్షన్లు పొందుతున్న ఉద్యోగులు కాని వారికి కమ్యూటెడ్ పెన్షన్ తగ్గింపులను అనుమతించడం, తాత్కాలికంగా ఉపయోగించని వ్యాపార ఆస్తులను "గృహ ఆస్తి" ఆదాయంగా పన్ను విధించకుండా ఉండటానికి సవరణ వంటివి ఉన్నాయి. ఈ మార్పులు చట్టాన్ని ప్రస్తుత నిబంధనలతో సమలేఖనం చేస్తూ న్యాయంగా,స్పష్టతను మెరుగుపరుస్తాయని కమిటీ తెలిపింది.అయితే ఇందులో పన్ను స్లాబ్‌లు, మూలధన లాభాల నియమాలు లేదా ఆదాయ వర్గాలలో మార్పులు లేవు.












Click it and Unblock the Notifications