Petrol Diesel hike: దేశ వ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.. రూ.110కి చేరువగా
దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రెండు రోజుల విరామం తర్వాత ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. లీటరు పెట్రోల్‌పై 31 పైసల నుంచి 39 పైసలు పెరిగింది. లీటరు డీజిల్ 15 పైసల నుంచి 21 పైసల మేర పెరిగింది. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.107.54కి,డీజిల్ ధర రూ.97.45కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.54,డీజిల్ రూ.89.85గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.94కి చేరగా... చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.23కి,లీటర్ డీజిల్ ధర రూ.94.39కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.105 పైనే ఉంది. దాదాపుగా రూ.110కి పెట్రోల్ ధర చేరువవుతోంది.
Recommended Video
దేశవ్యాప్తంగా మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకూ 35 పైచిలుకు సార్లు పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగాయి. గడిచిన రెండు నెలల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.9.11,లీటర్ డీజిల్ ధర రూ.8.63 మేర పెరిగింది.
భారత్‌లో పెట్రోల్,డీజిల్ ధరలను ఇండియన్ ఆయిల్,భారత్ పెట్రోలియం,హిందూస్తాన్ పెట్రోలియం వంటి కంపెనీలు నిత్యం సవరిస్తుంటాయి. అంతర్జాతీయంగా ముడి చుమురు ధరలు పెరగడం,విదేశీ మారకం హెచ్చు తగ్గులకు అనుగుణంగా ఇంధన ధరలు మారుతాయి. అయితే ఆ ప్రభావం కంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల కారణంగానే ఇంధన ధరలు ఈ స్థాయిలో ఉన్నాయి.

సాధారణంగా లీటరు పెట్రోల్ ధర రూ.30కి కాస్త అటు,ఇటుగా ఉంటుంది. కానీ అటు కేంద్రం,ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్,డీజిల్‌పై దాదాపు రూ.30 పన్ను వసూలు చేస్తుండటంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి రాకముందు లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.9.48గా ఉండేది. ఇప్పుడది దాదాపు రూ.32 పైనే ఉంది.
ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు,మరోవైపు పెట్రోల్,డీజిల్ ధరలు సామాన్యుడికి పెను భారంగా మారుతున్నాయి. ఇవి చాలవన్నట్లు వంట గ్యాస్ ధర కూడా పెరుగుతూనే ఉంది. ఇటీవలే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 మేర పెరిగింది. గడిచిన ఆర్నెళ్లలో వంట గ్యాస్ ధర రూ.140 మేర పెరగడం గమనార్హం. ప్రస్తుతం 14.2కేజీల సిలిండర్ ధర మార్కెట్లో రూ.850గా ఉంది. పెట్రోల్ ధరలు కూడా ఇప్పటికే రూ.110కి చేరవవడంతో మున్ముందు రూ.150 దాకా వెళ్లిన ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే సామాన్యుడికి మరింత గడ్డు పరిస్థితులు తప్పవు.












Click it and Unblock the Notifications