ఐఎస్ రిప్లైలోనూ క్రూరమే: రవిశంకర్‌కు నరికిన తల
అగర్తల: తమ క్రూరమైన కార్యకలాపాలతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తన సమాధానంలోనూ అంతే క్రూరత్వాన్ని ప్రదర్సించింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నుంచి దారుణమైన చేదు అనుభవం ఎదురైంది.
శాంతి చర్చలు జరపాలని పంపిన సందేశానికి ఐఎస్ఐస్ ఉగ్రవాదులు అత్యంత క్రూరమైన పద్ధతిలో సమాధానం ఇచ్చారు. ఆయన శాంతి సందేశానికి సమాధానంగా తాము చంపిన ఓ వ్యక్తి తల ఫోటోను వారు పంపించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

త్రిపురలోని అగర్తలలో జరిగిన ఓ కార్యక్రమంలో రవిశంకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐఎస్ ఉగ్రవాదులు తనకు పంపిన ఫొటో గురించి గుర్తు చేసుకున్నారు. ఐఎస్‌ఐఎస్‌తో శాంతి చర్చలకు ప్రయత్నించిన రవిశంకర్ ఇటీవల ఓ శాంతి సందేశాన్ని ఆ ఉగ్రవాద సంస్థకు పంపించారు.
అయితే ఇందుకు బదులుగా.. వారి నుంచి తల నరికిన ఓ వ్యక్తి ఫొటో వచ్చిందని ఆయన తెలిపారు. దీంతో తాను ఉగ్రవాద సంస్థతో చర్చించే ప్రయత్నం మానుకున్నట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాదులు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధపడాలని ఆయన పిలుపునిచ్చారు. తాను అన్ని సంస్కృతులను, మతాలను, విశ్వాసాలను, సిద్ధాంతాలను ఏకం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications