ఎస్సీ వర్గీకరణకు మరో ముందడుగు: ప్రధాని మోడీ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇందుకు సంబంధించిన కీలక ముందడుగు పడింది. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు, సదరు ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
నవంబర్ 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మాదిగల విశ్వరూప సభలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని చెప్పారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామని చెప్పారు. అంబేద్కర్ స్వప్నాన్ని తాము నెరవేరుస్తామన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదిగలను విరోధులుగా చూస్తున్నాయన్నారు. ఎంతో ప్రేమతో మందకృష్ణ (మందకృష్ణ మాదిగ) తమ్ముడు ఈ సభకు తనను ఆహ్వానించారన్నారు ప్రధాని మోడీ. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. మాదగిల ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
నేను మాటిస్తున్నా.. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాను. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తా. న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో కూడా కొనసాగుతోంది. చట్టపరంగా ఇబ్బందులు లేకుండా చూస్తాం. అదాలత్ లో కూడా మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. సామాజిక న్యాయంపై బీజేపీ మాత్రమే గ్యారంటీ ఇస్తుంది. నేను మందకృష్ణకు తోడుగా ఉంటాను అని ప్రధాని మోడీ ఆ సభలో స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications