ట్రంప్ పై కాల్పుల ఉదంతంపై ప్రధాని మోదీ షాక్
వాషింగ్టన్ డీసీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారీ భద్రత లోపం సంభవించింది. ఫలితంగా వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ నుండి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర పరిపాలనా అధికారులను హుటాహుటిన సురక్షిత ప్రదేశానికి తరలించాల్సి వచ్చింది. డిన్నర్ కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి కాల్పులకు దిగటమే దీనికి కారణం. తక్షణమే అక్కడి వారందరూ తమ ప్రాణాలను రక్షించుకోవడానికి కిందికి వంగారు. కొందరు టేబుళ్ల కింద తలదాచుకున్నారు.
వైట్ హౌస్ వార్తలను కవర్ చేసే వైట్ హౌస్ ప్రెస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ కోసం ఏర్పాటు చేసిన డిన్నర్ ఇది. వాషింగ్టన్ లోని హిల్టన్ హోటల్ లో అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఏర్పాటైంది. దీనికి డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తో పాటు పలువురు వైట్ హౌస్ అత్యున్నత అధికారులు హాజరయ్యారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఉన్నారు. 2,600 మంది అతిథులు పాల్గొన్నారు.

ఇక్కడ జరిగిన కాల్పులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దురాగతాలకు తావు లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో అమెరికన్ సీక్రెట్ సర్వీస్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ను అభినందించారు మోదీ. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ ను కాపాడే క్రమంలో క్షణాల్లో మెరుపువేగంతో స్పందించిన తీరును ఆయన ప్రశంసించారు.
Relieved to learn that President Trump, the First Lady and Vice President are safe and unharmed following the recent security incident at a Washington DC hotel. I extend my best wishes for their continued safety and well-being. Violence has no place in a democracy and must be…
— Narendra Modi (@narendramodi) April 26, 2026
వైట్ హౌస్ ప్రెస్ కరస్పాండెంట్స్ డిన్నర్ లో కాల్పులు జరిగిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మోదీ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సురక్షితంగా, ఎటువంటి హాని లేకుండా బయటపడటం తనకు ఊరటనిచ్చిందని అన్నారు. వారి నిరంతర భద్రతతో పాటు శ్రేయస్సు కోసం తన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు ఏ మాత్రం స్థానం లేదని, దీనిని నిర్ద్వంద్వంగా ఖండించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications