ఈ దీపావళిని ఇలా జరుపుకోండి. దేశ ప్రజలకు మోదీ పిలుపు
దీపావళిని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక పిలుపునిచ్చారు. భారతీయ సాంప్రదాయ ఉత్పత్తులు, స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయని కొనియాడారు. దేశప్రజలు స్వదేశీ వస్తువులను ఆదరించడం వల్లే మన రైతులు, గ్రామీణ చేతివృత్తుల కళాకారుల ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్లోకి వేగంగా అడుగుపెడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం నాటి 'మన్ కీ బాత్' 139వ సంచికలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. 'వోకల్ ఫర్ లోకల్' నినాదం కేవలం పిలుపు మాత్రమే కాదని, అది ఆత్మనిర్భర్ భారత్ వైపు దేశాన్ని తీసుకెళ్లే ఒక గొప్ప శక్తని స్పష్టం చేశారు.
స్థానిక పంటలు, ఉత్పత్తులు విదేశీ వేదికలపై ఏ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయో చెప్పడానికి ప్రధాని కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను ప్రస్తావించారు. బీహార్‌లోని పూర్ణియా జిల్లాకు చెందిన 'మఖానా' నేడు నేరుగా గ్రీస్ దేశానికి ఎగుమతి అవుతుండగా, కర్ణాటకలోని కలాబురగి ప్రాంతపు ప్రసిద్ధ కందిపప్పు మాల్దీవుల మార్కెట్లలోకి అందుబాటులోకి వచ్చింది. భారతీయ రైతుల కష్టానికి విదేశాల్లో సరికొత్త మార్కెట్లు తలుపులు బార్లా తెరుచుకుంటున్నాయని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర గిరిజన ప్యాకేజింగ్‌కు జపాన్ గ్లోబల్ అవార్డు!
చేతివృత్తులు, గిరిజన ఉత్పత్తులకు ఆధునిక టచ్ ఇస్తే అద్భుతాలు సృష్టించవచ్చని మహారాష్ట్ర గిరిజనులు నిరూపించారని ప్రధాని మోదీ ప్రశంసించారు. అక్కడ 'శబరి నేచురల్స్' ద్వారా తేనె, మహువా, చిర్, వెదురు ఉత్పత్తులను ఆధునిక ప్యాకేజింగ్‌తో మార్కెట్లోకి తెచ్చారు. గిరిజన కళలతో కూడిన ఈ అద్భుత ప్యాకేజింగ్‌కు జపాన్ ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక 'గుడ్ డిజైన్ అవార్డు' దక్కడం మన స్వదేశీ నైపుణ్యానికి నిదర్శనమని చెప్పారు. ఖాదీ, హస్తకళల రంగం మళ్లీ ఊపందుకోవడంతో స్థానిక కళాకారులకు ఆర్థికంగా ఊరట లభిస్తోందన్నారు.
పండుగల వేళ స్వదేశీ వస్తువులకే తొలి ప్రాధాన్యం ఇవ్వండి!
రాబోయే దీపావళి, ఛఠ్ పూజ పండుగల సందర్భంలో ప్రతి ఒక్కరూ షాపింగ్ చేసేటప్పుడు స్థానిక వ్యాపారులు, కళాకారులు తయారు చేసిన మన వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. మన వద్ద పనిచేసే చిన్నచిన్న వర్తకులు, కళాకారుల నుంచి కొనుగోలు చేయడం వల్ల వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని, ఇది ఆత్మనిర్భర్ భారత్ స్వప్నాన్ని వేగవంతం చేస్తుందని తెలిపారు. ఇదే సమయంలో పండుగల వేళ ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే పారిశుధ్య ఉద్యమంలో కూడా ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
'మన్ కీ బాత్' నాకు ఒక పవిత్ర తీర్థయాత్ర లాంటిది!
విజయదశమి పర్వదినాన ప్రారంభమైన 'మన్ కీ బాత్' ప్రయాణం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై ప్రధాని స్పందిస్తూ.. ఈ కార్యక్రమం తనకు ఒక తీర్థయాత్రతో సమానమని చెప్పారు. సామాన్య ప్రజల కష్టం, నిబద్ధత, సేవాభావాన్ని దగ్గరగా చూసేందుకు, వారి కష్టానికి జోహార్లు అర్పించేందుకు ఇది తనకు లభించిన గొప్ప అవకాశమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ ప్రసంగాన్ని అత్యంత ఉత్సాహంగా ఆలకించారు.














Click it and Unblock the Notifications
