కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్- రూట్ ఇదే: రేపటి నుంచే
Vande Bharat Express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 51 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

ఈ క్రమంలో కొత్తగా మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కబోతోంది. ఇది 52వది. చెన్నై ఎగ్మూర్ నుంచి నాగర్ కోయిల్ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.
చెన్నై ఎగ్మూర్- నాగర్ కోయిల్ మధ్య దూరం 724 కిలోమీటర్లు. ఈ దూరాన్ని తొమ్మిది గంటల వ్యవధిలో అధిగమిస్తుంది వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలుకు సంంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే రైల్వే అధికారులు విడుదల చేశారు.
తెల్లవారు జామున 5 గంటలకు ఎగ్మూర్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్.. 5:23 నిమిషాలకు తాంబరం చేరుకుంటుంది. విల్లుపురం- 6:52, తిరుచ్చి- ఉదయం 8:55, దిండిగల్- 9:53, మధురై- 10:38, కోవిల్‌పట్టి- 11:35, తిరునెల్వేలి- మధ్యాహ్నం 12:30, నాగర్ కోయిల్- 1:50 నిమిషాలకు చేరుకుంటుంది.
అదే రోజు మధ్యాహ్నం 2: 20 నిమిషాలకు మళ్లీ ఎగ్మూర్‌కు తిరుగుముఖం పడుతుందీ రైలు. తిరునెల్వేలి- 3:18, కోవిల్‌పట్టి- 3:58, మధురై- సాయంత్రం 5:03, దిండిగల్- 5:48, తిరుచ్చి- 6:45, విల్లుపురం- రాత్రి: 8:53, తాంబరం- 10:28, ఎగ్మూర్- 11 గంటలకు చేరుకుంటుంది.
మొత్తం 16 కోచ్‌లు ఉన్న ఎక్స్‌ప్రెస్ ఇది. సాధారణ టికెట ధర 1,650 రూపాయలు. చైర్ క్లాస్ టికెట్ ధర 1,700 రూపాయలు. అదే సమయంలో మధురై- బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోదీ ప్రారంభిస్తారు. ఇది 53వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.
మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజు తెల్లవారు జామున 5: 15 నిమిషాలకు మధురై నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం ఒంటిగంటకు బెంగళూరు కంటోన్మెంట్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1:30 నిమిషాలకు బెంగళూరు కంటోన్మెంట్ నుంచి బయలుదేరి రాత్రి 9:45 నిమిషాలకు మధురై చేరుకుంటుంది. దిండిగల్, తిరుచ్చి, కరూర్, నమక్కల్, సేలం, కృష్ణరాజపురం మీదుగా రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications