PM Modi: కాంగ్రెస్ రాష్ట్రపతిని అవమానించింది.. సోనియా "పూర్ లేడీ" వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్
PM Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజే రాష్ట్రపతి ప్రసంగంపై అధికార, ప్రతిపక్షాలు మాటల దాడికి దిగాయి. ఈ రోజు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా గాంధీని మీడియా పలకరించగా.. "పూర్ లేడీ..పాపం ప్రసంగం చివరి వరకు వచ్చేసరికి రాష్ట్రపతి అలసిపోయి, ఆమె మాట్లాడలేకపోయారు." అంటూ సోనియా సమాధానమిచ్చారు. అలాగే రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "రాష్ట్రపతి ప్రసంగం వెరీ బోరింగ్.. నో కామెంట్" అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ విపక్షాలపై దాడి చేశారు. కాంగ్రెస్ రాష్ట్రపతిని అవమానించిందని ఆయన వ్యాఖ్యానించారు.
దేశం మరోసారి కాంగ్రెస్ రాజకుటుంబాన్ని చూసిందని ప్రధాని మోడీ విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయన మాటల దాడి చేశారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ.."ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె ఒడిశాలోని ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఇక్కడికి చేరుకుంది. ఆమె మాతృభాష హిందీ కాదు, ఆమె ఒరియాలో పెరిగారు, ఈ రోజు పార్లమెంట్ లో చాలా బాగా ప్రసంగించారు. కానీ కాంగ్రెస్ రాజకుటుంబం ఆమెను అవమానించడం ప్రారంభించింది. రాష్ట్రపతి బోరింగ్ ప్రసంగం చేశారని రాజకుటుంబ సభ్యులు ఒకరు అన్నారు. మరో సభ్యులు దానిని కూడా దాటి వెళ్లారు. రాష్ట్రపతి ప్రసంగంపై వ్యాఖ్యానిస్తూ పూర్ లేడీ అని పిలిచారు. రాష్ట్రపతి అలసిపోయిందని అన్నారు." అని ప్రధాని మోడీ మండిపడ్డారు.

ఒక గిరిజన కూతురు మాట్లాడడం వినడానికి కాంగ్రెస్ వారికి బోరింగ్ అనిపిస్తుందని ప్రధాని మోడీ విమర్శించారు. ఇది దేశంలోని 10 కోట్ల మంది గిరిజన సోదరసోదరీమణులకు అవమానమన్నారు. ఇది దేశంలోని ప్రతి గిరిజన సోదరికి అవమానమని వ్యాఖ్యానించారు. ముందుకు సాగే పేద, దళిత గిరిజన ప్రజలను కాంగ్రెస్ అడుగడుగునా అవమానిస్తుందని ఆయన అన్నారు. వారికి ప్రజలను దుర్భాషలాడడం, విదేశాల్లో భారతదేశాన్ని కించపరచడం, అర్బన్ నక్సల్స్ గురించి మాట్లాడటం ఇష్టమంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకున్న నడ్డా
అంతకు ముందు బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా సోనియా గాంధీ రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎక్స్ లో పోస్ట్ చేశారు. సోనియా గాంధీ రాష్ట్రపతి ముర్మును "పూర్ లేడీ" అన్నారని.. దీనిని తనతో పాటు ప్రతి బీజేపీ కార్యకర్త తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా ఇటువంటి పదాలు ఉపయోగించడం కాంగ్రెస్ పేద, గిరిజన వ్యతిరేక స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని నడ్డా అన్నారు.రాష్ట్రపతికి, గిరిజన సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా ఆయన కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications