మరో వందే భారత్: 11 జిల్లాల మీదుగా.. రూట్, ఛార్జీ వివరాలు ఇవే
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్న అత్యాధునిక వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య ఇక మరింత పెరగనుంది. ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో ఆ సర్వీసులను ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తోన్న ఈ రైళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు 15 రైళ్లు పట్టాలెక్కాయి.
తాజాగా మరో వందే భారత్ రైలును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేరళలో మొట్టమొదటి సారిగా ఈ రైలు పట్టాలెక్కబోతోంది. తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్ మధ్య పరుగులు పెట్టనుంది. మొత్తంగా 11 జిల్లాల మీదుగా ఈ సరికొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగించబోతోంది. తిరువనంతపురం నుంచి బయలుదేరే ఈ రైలుకు కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం టౌన్, త్రిశూర్, షోరనూర్ జంక్షన్, కోజికోడ్, కన్నూర్‌లల్లో హాల్ట్ సౌకర్యం కల్పించారు.

ఇవ్వాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరువనంతపురంలో పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించనున్నారు. వందే భారత్ సిరీస్‌లో ఇది 16వ ఎక్స్ ప్రెస్ అవుతుంది. ఇదివరకే ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. 20633/20634 నంబర్లను దీనికి కేటాయించారు. కాసర్‌గోడ్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్.. అదే రోజు రాత్రి 10:35 నిమిషాలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటుంది.
మరుసటి రోజు తెల్లవారు జామున 5:20 నిమిషాలకు తిరువనంతపురం సెంట్రల్ నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1:25 నిమిషాలకు కాసర్‌గోడ్‌కు చేరుకుంటుంది. ఈ రైలు ఛార్జీ 1,520 రూపాయలుగా నిర్ధారించారు. 308 రూపాయల భోజనం ఛార్జీని ఇందులోనే వసూలు చేస్తారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీని 2,815 రూపాయలు. 369 రూపాయల భోజనం ఛార్జీని ఇందులోనే మిళితం చేశారు. నో ఫుడ్ ఆప్షన్ కూడా ఉంది.
తన పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన వాటర్ మెట్రో సర్వీసులను కూడా ఆయన ప్రారంభిస్తారు. కోచి వాటర్ మెట్రో సర్వీస్ ఇది. కోచి పరిధిలో ఉన్న 10 చిన్న చిన్న ద్వీపాలను అనుసంధానిస్తూ ఈ మెట్రో సర్వీస్ రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications