అధికారిక నివాసానికి ప్రధాని మోడీ: మార్పులు లేవు!
న్యూఢిల్లీ: ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసిన ఐదురోజులకు నరేంద్ర మోడీ 7 రేస్ కోర్స్ రోడ్‌లోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు తాత్కాలికంగా గుజరాత్ భవన్‌లో నివాసం ఉన్నారు. రేస్ కోర్స్ రోడ్‌లోని నివాసంలో శుక్రవారం ఉదయం పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నరేంద్ర మోడీ అధికారిక నివాసానికి మారారు.
నరేంద్ర మోడీకి సంబంధించినవన్నీ వస్తువులు రేస్ కోర్స్ రోడ్ 5 నెంబర్ నివాసానికి తరలించారు. 5వ నెంబర్ బంగ్లాలో గతంలో ప్రధానిగా ఉన్న సమయంలో అటల్ బీహార్ వాజ్‌పాయి నివాసం ఉన్నారు. అదే నివాసంలోకి ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రవేశించారు. రేస్ కోర్స్ రోడ్ నెంబర్ 7 బంగ్లాను నరేంద్ర మోడీ తన అధికారిక కార్యకలాపాల కోసం కార్యాలయంగా ఉపయోగించుకోనున్నారు.

మే 26న నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మాజీ ప్రధాని మన్మోహన్ రేస్ కోర్స్ రోడ్ నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే ఆ బంగ్లాలో ఎలాంటి నవీకరణ పనులు చేయాలని కూడా నరేంద్ర మోడీ కోరుకోలేదు. సాధారణ జీవనం సాగించే నరేంద్ర మోడీ.. మన్మోహన్ ఖాళీ చేసిన భవనం యధాతథంగా ఉండేందుకే మొగ్గుచూపినట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఇప్పటి వరకు నూతన ప్రధాని అయిన వారు అధికారిక నివాసంలోకి వచ్చేటప్పుడు తమకు కావాల్సిన రీతిలో నివాసాన్ని నవీకరించడం, సుందరీకరించడం చేసే వారని ప్రధాని కార్యాలయ అధికారులు తెలిపారు. అయితే నరేంద్ర మోడీ మాత్రం ఎలాంటి మార్పులు గానీ, నవీకరించాలని గానీ కోరలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications