ఎరువులు, గ్యాస్‌పై పుకార్లు.. ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్!
'నా జీవితంలో చివరి క్షణం వరకు భారత ప్రజల సేవలోనే నిమగ్నమై ఉంటాను" అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ కార్యక్రమంలో 'మోదీ బాప్ కూడా పోవాల్సిందే' అంటూ చేసిన వివాదాస్పద కామెంట్లపై ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో పరోక్షంగా ఘాటుగా స్పందించారు. దేశం ఏదైనా కష్టంలో ఉన్నప్పడు ఆనందించే కొందరు వ్యక్తులు కేవలం నన్ను బదనాం చేయడం కోసమే దేశవ్యాప్తంగా అరాచకాన్ని, భయాందోళనలను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
రూ.14,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
శుక్రవారం గుజరాత్‌లోని బనాస్‌కాంతా జిల్లా ఖిల్డీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అంతకు ముందు భారత్ బోవైన్ బ్రీడింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన ఆయన.. రూ.14,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇదే వేదికపై నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడత నిధులను కూడా విడుదల చేశారు. రైతులు, యువత, మహిళలు వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు అవుతుంటే.. కొందరు మాత్రం దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎరువులు, గ్యాస్ కొరతపై పుకార్లు.. ప్రధాని ఆగ్రహం
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రతిపక్షాలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "రైతులకు ఇకపై ఎరువులు దొరకవని, వంట గ్యాస్ నిలిచిపోతుందని పుకార్లు వ్యాప్తి చేశారు. మహిళలను భయభ్రాంతులకు గురిచేసి, దేశంలో గందరగోళం సృష్టించి మోదీని బదనాం చేయాలని చూశారు. కానీ అంతర్జాతీయంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ.. ఆ భారాన్ని రైతులపై పడకుండా ప్రభుత్వమే భరించింది" అని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యూరియా బస్తా ధర రూ.3,000 వరకు ఉంటే.. భారతీయ రైతులకు దానిని రూ.300 కన్నా తక్కువకే అందిస్తున్నామని.. అలాగే రూ.5,000 విలువైన డీఏపీ బస్తాను రూ.1,350కే అందజేస్తున్నామని ప్రధాని గుర్తుచేశారు.
సభలో వినూత్నంగా మంచాలు
ఖిల్డీలో జరిగిన ప్రధాని సభలో ఓ వినూత్న దృశ్యం కనిపించింది. సభకు వచ్చిన ప్రజలు కూర్చోవడానికి నిర్వాహకులు కుర్చీలకు బదులుగా గ్రామీణ సంస్కృతికి ప్రతీకైన మంచాలు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసిస్తూ.. బహుశా ఇది దేశంలోనే అతిపెద్ద మంచాల సభ కావచ్చు అని నవ్వుతూ అన్నారు. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రజల ప్రయోజనాల కోసంమోదీ ఎల్లప్పుడూ కొండంత అండగా నిలబడతారని ప్రధాని స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
