సోనియా బర్త్ డేకు మోడీ సర్‌ప్రైజ్ గిఫ్ట్, డిఎస్ పూజలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆశ్చర్యకరమైన జన్మదిన కానుక ఇచ్చారు. మంగళవారంనాడు ఉదయమే ఆయన సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సోనియాకు జన్మదిన శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలిపారు.
సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలని, దైవం ఆమెకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన ట్విట్టర్‌లో రాశారు. తెలంగాణకు సంబంధించినంత వరకు సోనియా గాంధీ జన్మదినం ప్రత్యేకమైంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లు ఆమె జన్మదినం రోజునే ప్రకటన వెలువడింది.

డిఎస్ ప్రత్యేక పూజలు
సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా పిసిసి మాజీ అధ్యక్షుడు, కాంగ్రెసు ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్‌లోని మాధవనగర్ సాయిబాబా ఆలయంలో ఆయన సోనియా పేరుతో ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. ఆ తర్వాత దేవాలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో ఎన్నో అడ్డంకులు, విమర్శలు ఎదురైనా వాటికి ఎదురు నిలిచి సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెసు నేతలు భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెసు పార్టీ నేతలు ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర విభజన ద్వారా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాందీ బంగారు తెలంగాణను అప్పగించారని డిఎస్ అన్నారు. బంగారు తెలంగాణను రత్నాల తెలంగాణగా మార్చాల్సి ఉందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో కెసిఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోను అమలు చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications