మోడీ అమెరికా, ఫ్రాన్స్ పర్యటన ఖరారు, 13న ట్రంప్‌తో భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా, ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అమెరికాలో మోడీ పర్యటిస్తారని కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు.
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరిగే కృత్రిమ మేధ (AI) సదస్సులో ప్రధాన మోడీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 10వ తేదీన ప్రధాని మోడీ ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. కెడారచీ థర్మో న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌ను ప్రధాని పరిశీలిస్తారని విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు.

ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న తర్వాత ఫిబ్రవరి 12వ తేదీన సాయంత్రానికి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో భేటీ కానున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భేటీ కాబోతున్నారు మోడీ.
ఈ సందర్భంగా పలు కీలక అంశాపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అక్రమ వలసలపై ట్రంప్ సర్కారు కఠిన చర్యలకు దిగడంతోపాటు పలు దేశాలపై టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, ట్రంప్ వచ్చే వారం జరిగే సమావేశానికి ప్రధాని మోడీని ఆహ్వానించారని వైట్‌హౌస్ అధికారిక ప్రకటించిన కొద్దిసేపటికే భారత ప్రధాని అమెరికా పర్యటన ఖరారైంది. గత నెలలో ఇరు దేశాధినేతల మధ్య జరిగిన సందర్భంలోనూ ఈ పర్యటనకు సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం.
జనవరి 27న, ప్రధాని మోడీ.. ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సాంకేతికత, వాణిజ్యం, రక్షణ వంటి ముఖ్యమైన రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడం గురించి చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకోవడంతోపాటు ప్రపంచ శాంతి, భద్రత కోసం సహకరించడానికి తమ నిబద్ధతను ఇరు దేశాధినేతలు పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications