సునీల్ కానుగోలు రుణం తీర్చుకున్న సిద్ధరామయ్య- కేబినెట్ హోదా
బెంగళూరు: కర్ణాటకలో జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. అధికార భారతీయ జనతా పార్టీ చిత్తు చేసింది. ఎగ్జిట్ పోల్స్ జోస్యాలనూ తిరగరాసింది. హంగ్ రావొచ్చని లేదా కాంగ్రెస్ పార్టీ బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ వెలువడిన అంచనాలను మించిన విజయాన్ని అందుకుంది కాంగ్రెస్.
కిందటి నెల 10వ తేదీన జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి లభించిన సీట్ల సంఖ్య 66. కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్) 19 నియోజకవర్గాలకే పరిమితమైంది. ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. 34 మంత్రులతో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారకుడు.. సునీల్ కానుగోలు. కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారాయన. కాంగ్రెస్ ఎన్నికల టీమ్‌ను నడిపించారు. నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారతీరును ఆయన పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేయగలిగారాయన.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి హేమాహేమీల మధ్య కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు, అయిదు గ్యారంటీలు, మేనిఫెస్టోను ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా ప్రచార వ్యూహాలను రూపొందించగలిగారు. దాన్ని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ప్రత్యేకించి- బజరంగ్ దళ్ నిషేధంపై బీజేపీ నేతలు చేసిన దాడిని తిప్పికొట్టడంలో సక్సెస్ అయ్యారు.
అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై 40 శాతం కమిషన్, పేసీఎం అంటూ చేసిన ప్రచారం ప్రజల్లో చొచ్చుకెళ్లింది. పేటీఎం తరహాలో పేసీఎం అంటూ కర్ణాటక వ్యాప్తంగా విస్తృతంగా పోస్టర్లు వెలిశాయి. ఇవన్నీ బీజేపీ ప్రభుత్వ పరాజయానికి దారి తీశాయి. అదే సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో, అయిదు గ్యారంటీలను జనంలోకి తీసుకెళ్లగలిగారు.

ఈ నేపథ్యంలో- సునీల్ కానుగోలు రుణాన్ని తీర్చుకున్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అతి కొద్దిరోజుల్లోనే ఆయనకు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలను అప్పగించారు. తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. సునీల్ కానుగోలును ముఖ్యమంత్రి చీఫ్ అడ్వైజర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు కేబినెట్ హోదాను కల్పించారు.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన సునీల్ కానుగోలు బళ్లారిలో జన్మించారు. ఎంబీఏ, ఫైనాన్స్‌లో ఎంఎస్ డిగ్రీని పూర్తి చేశారు. చెన్నై, బెంగళూరుల్లో నివాసం ఉన్నారు. 2014లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్‌లో జాయిన్ అయ్యారు. కీలక సభ్యుడిగా ఎదిగారు. కొద్దిరోజుల పాటు తెలుగుదేశం పార్టీ, భారత్ రాష్ట్ర సమితిలకూ వ్యూహకర్తగా పని చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు.












Click it and Unblock the Notifications