విజయ్, సువేందు సత్తాకు లిట్మస్ టెస్ట్..!!
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉప ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. మొత్తం ఆరు స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల కమిషన్. వీటిల్లో కీలక రాష్ట్రాలు ఉండటం, ఒకట్రెండు ప్రతిష్ఠాత్మక నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోండటం వల్ల అందరి దృష్టి వీటి మీదే నిలిచింది. ఈ నెల 6వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
ఈ పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో టీవీకే అధికారంలో ఉన్న తమిళనాడు, బీజేపీ నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పశ్చిమ బెంగాల్ ఉండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రెండింటితో పాటు అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో మొత్తం అయిదు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ తమ అభ్యర్థులను ఎన్నుకుంటోన్నారు.

తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం, పశ్చిమ బెంగాల్ లో నందిగ్రామ్, రెజీనగర్ ఫలితాలు ఎలా ఉండబోతోన్నాయనేది చర్చనీయాంశమౌతోంది. ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా అక్కడి ప్రభుత్వాలకు లిట్మస్ టెస్ట్ పెడుతున్నట్టే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజయ్, సువేందు అధికారి.. ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్నారు. వారి పాలనకు ఈ ఎన్నికలు గీటురాయి కాబోతోంది.
మధురాంతకం.. ఏఐఏడీఎంకే సొంత నియోజకవర్గం. ఈ ఏడాది మే లో జరిగిన ఎన్నికల్లో మరగతం కుమారవేళ్ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఏఐఏడీఎంకేకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఇప్పుడీ ఉప ఎన్నికల్లో కుమారవేళ్.. టీవీకే అభ్యర్థిగా బరిలో నిలిచారు. డీఎంకే తరఫున పరంథామేన్, ఏఐఏడీఎంకే నుంచి కణిథ సంపత్ పోటీ చేశారు. ధారాపురంలో కూడా ఇదే పరిస్థితి. ఇదీ ఏఐఏడీఎంకే స్థానమే. ఇక్కడ గెలిచిన సత్యభామ.. టీవీకేలో చేరారు. ఇప్పుడదే పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికల బరిలో నిలిచారు. డీఎంకే నుంచి సుగన్య, ఏఐఏడీఎంకే తరఫున భానుమతి పోటీ చేస్తోన్నారు.
పశ్చిమ బెంగాల్ లో సువేందు అధికారి సొంత నియోజకవర్గం.. నందిగ్రామ్. మే లో జరిగిన ఎన్నికల్లో భవానీపూర్, నందిగ్రామ్ నుంచి గెలిచారు సువేందు. నందిగ్రామ్ కు రాజీనామా చేశారు. ఆయన ఖాళీ చేసిన స్థానం కావడం వల్ల బీజేపీ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. హసిరాణి రథ్ ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేయలేదు గానీ.. కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ కు మద్దతు ప్రకటించింది.












Click it and Unblock the Notifications
