ప్రతి ఒక్కరికీ రూ. 15,000 వేలు: రూ. లక్ష కోట్ల భారీ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ- మాస్టర్ స్ట్రోక్..!!
యావత్ దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతోంది. నయా భారత్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకొంటున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.
పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తోన్నారు. తన ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తావించారు ప్రధాని మోదీ. శత్రువులను అంచనాలకు మించిన స్థాయిలో దెబ్బతీశామని, వాళ్ల వెన్ను విరిచామని అన్నారు.

అనంతరం భారీ ప్రకటన చేశారు ప్రధాని మోదీ. ఈ దీపావళి పండగ నాటికి నెక్స్ట్ జెన్ జీఎస్టీ (Next-Gen GST) వ్యవస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు. పన్నుల రేట్లను గణనీయంగా తగ్గిస్తామని అన్నారు. ఈ పన్నుల తగ్గింపును సాధారణ ప్రజలు, సూక్ష్మ- చిన్న- మధ్య తరహా పరిశ్రమల (MSMEs)కు ఓ బహుమతిగా ఆయన అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడతామని అన్నారు.
ఈ సందర్భంగా కోట్లాదిమంది యువతకు ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా ఓ సరికొత్త పథకాన్ని ప్రారంభించారు మోదీ. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనను ఆవిష్కరించారు. ఈ పథకానికి ఏకంగా లక్ష కోట్ల రూపాయల మేర నిధులను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ పథకం కింద- ప్రైవేటు రంగంలో మొదటిసారిగా ఉద్యోగం పొందిన ప్రతి ఒక్క యువతకు కేంద్రం 15,000 రూపాయలను అందజేస్తుంది. సుమారు 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు.
యువత సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. యువత తమ ఆలోచనలను ఎప్పుడూ నిర్వీర్యం చేయనివ్వకూడదని అన్నారు. వారితో కలిసి భాగస్వామిగా పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అన్ని రంగాల్లోనూ యువత ముందంజ వేయాలని, ధైర్యంగా ముందడుగు వేయాలని సూచించారు. వారితో తాను ఉన్నానుని భరోసా ఇచ్చారు.
ఈ క్రమంలో కొన్ని రకాల ప్రభుత్వ నిబంధనలు మారాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. యువతకు అనుకూలంగా ఈ మార్పులు చేస్తాయని అన్నారు. ఆ మార్పులకు సంబంధించిన సూచనలను ఇవ్వాలని మోదీ యువతను కోరారు. 2047 ఎంతో దూరం లేదు, ప్రతి క్షణం విలువైనదని, ఒక్కటి కూడా వృథా చేయకూడదని సూచించారు.
గత దశాబ్దం కాలంలో అమలు చేసిన సంస్కరణలు, పనితీరు, పరివర్తనకు పునరంకితం కావాలని యువతకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇప్పుడు గొప్ప లక్ష్యాలపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. అన్ని దేశాల్లోకెల్లా భారత్ ను అగ్రగామిగా నిలిపాల్సిన బాధ్యత యువత భుజస్కందాలపై ఉందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications