అతను బెదిరిస్తున్నాడు: సిఎంకు ప్రత్యూష తల్లి లేఖ
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ('చిన్నారి పెళ్లి కూతరు'లో ఆనంది) బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ తమను బెదిరిస్తున్నాడని ఆమె తల్లి సోమా బెనర్జీ ఆరోపించించారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి రాహులే కారణమని, ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులతో విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాశారు.
'రాహుల్ మా అమ్మాయి ప్రత్యూషను మోసం చేయడమే కాదు, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణమయ్యాడు. అతను అమాయికులైన కొందరు యువతులను మోసం చేసి డబ్బు తీసుకున్నాడు' అని సోమా మీడియా సమావేశంలో ఆరోపించారు.
ఈ కేసును ముంబైలోని బంగుర్ నగర్ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలేదని ఆరోపించారు. సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి వీలుగా నిందితుడిని స్వేచ్ఛగా వదిలేశారని అన్నారు. రాహుల్ తమతో పాటు ఇతర సాక్షులను బెదిరిస్తున్నాడని సీఎంకు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు.

ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్ లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు, సన్నిహితులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతికి రాహులే కారణమని పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. రాహల్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, బెయిల్‌పై అతడు విడుదలయ్యాడు.












Click it and Unblock the Notifications