బాంబు పేల్చిన కేంద్రం: గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంపు
Commercial LPG Cylinder Price: వంటగ్యాస్ వినియోగదారులపై భారం పడింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై అదనంగా రూ.16.50 పైసలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచిన ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు పెరగడం వరుసగా ఇది అయిదోసారి. ఆగస్టు నుంచి ఇప్పటివరకు ప్రతినెలా ఒకటో తేదీన వీటి రేట్లు పెరుగుతూ వస్తోన్నాయి. వాటని సవరిస్తూ ఉత్తర్వులను జారీ చేస్తూ వస్తోన్నాయి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.

ఈ అయిదు నెలల వ్యవధిలో అదనంగా రూ. 172.50 పైసలను అదనంగా చెల్లించాల్సి వస్తోంది. తాజా పెంపుతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు రూ.1,818.50 పైసలకు పెరిగింది. నిన్నటి వరకు ఈ ధర 1,802 రూపాయలుగా ఉండేది. కోల్‌కతలో రూ. 1,911.50 పైసల నుంచి 1,927 రూపాయలకు పెరిగింది.
ముంబైలో రూ. 1,754.50 నుంచి 1,771 రూపాయలకు పెరిగింది. చెన్నైలో రూ. 1,964.50 నుంచి 1,980 రూపాయలకు చేరింది ఒక్కో కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో కూడా వాటి రేట్లను పెంచాయి చమురు కంపెనీలు.
ఆగస్టులో ఒక్కో సిలిండర్ మీద రూ.8.50 పైసలు, సెప్టెంబర్ 1వ తేదీన 39 రూపాయలు, అక్టోబర్‌లో 48.50 పైసలు, నవంబర్‌లో ఏకంగా 62 రూపాయల మేర భారాన్ని వినియోగదారుల మీద మోపాయి. ఇప్పుడు మళ్లీ రూ.16.50 పైసల చొప్పున పెంచాయి.
గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర 803 రూపాయలు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో గ్యాస్ కనెక్షన్‌పై 200 రూపాయల సబ్సిడీని ఇచ్చింది.












Click it and Unblock the Notifications