అర్థరాత్రి ఒంటిగంటకు ఫోన్ చేసిన ప్రధాని మోడీ
సంక్షోభం తలెత్తినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీరు చాలా గొప్పగా ఉంటుందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. తన నాయకత్వ ప్రతిభతో ఎన్నో సమస్యలను ఆయన సామరస్యంగా పరిష్కరించారని కొనియాడారు. న్యూయార్క్‌లో మోదీ@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనను తెలిపారు. జై శంకర్ మాటల్లో..
""అఫ్గానిస్థాన్‌లోని మజర్-ఇ-షరీఫ్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయంపై 2016లో దాడి జరిగింది. అప్పుడు నేను విదేశాంగ శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నా. దాడి విషయం అర్ధరాత్రి తెలిసింది. దీంతో వెంటనే అక్కడి అధికారులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించాం. అదే సమయంలో ప్రధానమంత్రి నాకు స్వయంగా ఫోన్ చేసి అడిగిన మొదటి ప్రశ్న మెలకువగానే ఉన్నారా? అని. నేను అవునని చెప్పి.. జరిగిన ఘటన నుంచి ప్రధానమంత్రికి అప్‌డేట్ చేశా. భారత్ నుంచి అవసరమైన సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలియజేశాను. అప్పుడు మోడీ.. "పూర్తయ్యాక నాకు ఫోన్ చేయండి" అన్నారు.

అయితే దానికి రెండు, మూడు గంటల సమయం పడుతుందని, పీఎంవో కార్యాలయానికి ఫోన్ చేస్తానని చెప్పాను. దీనికి మోడీ స్పందిస్తూ.. 'నాకే ఫోన్ చేయండి' అన్నారు. ఈ ఒక్క మాట చాలు.. ఆయనలోని అసాధారణ నాయకత్వ లక్షణాల గురించి చెప్పడానికి" అని జైశంకర్ నాటి సంఘటనను తెలియజేశారు. అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రధానమంత్రి మన వెంటే ఉంటారని, అది ఆయన గొప్పతనమన్నారు. తనకు తెలియని విషయాలను కూడా అడిగి తెలుసుకుంటారని, అందులో ఏమాత్రం సందేహించరన్నారు.












Click it and Unblock the Notifications