భారత ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి బహుమతిగా ఇచ్చిన మోదీ!
ప్రపంచ దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను బలపడటంలో మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొని స్వదేశానికి తిరిగొచ్చిన ఆయన, పర్యటనలో భాగంగా ప్రపంచ దేశాల అధినేతలకు అందించిన బహుమతులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆసియాన్-ఇండియా సదస్సు, తూర్పు ఆసియా సదస్సుతో పాటు క్వాడ్ నేతల సమావేశంలో పాల్గొన్న ప్రధాని.. మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అరుదైన చేనేత, హస్తకళల వస్తువులను ఆయా దేశాల ప్రధానులు, అధ్యక్షులకు కానుకలుగా అందజేశారు. దీని ద్వారా భారతదేశం యొక్క ఘనమైన సాంసృతిక వారసత్వాన్ని, అద్భుతమైన ఆర్టిసానల్ లెగసీని ప్రపంచానికి గర్వంగా చాటిచెప్పారు.
ఫిలిప్పీన్స్ అధ్యక్ష దంపతులకు కాశ్మీరీ కళల కానుక..
పర్యటనలో భాగంగా ఆతిథ్య దేశమైన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్టినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్‌కు ప్రధాని మోదీ ఎంతో ప్రత్యేకమైన కాశ్మీరీ సిల్క్ కార్పెట్‌ను బహుమతిగా ఇచ్చారు. సున్నితమైన సిల్క్ దారాలతో, వేలాది ముడులతో నిపుణులైన కళాకారులు చేతితో అల్లే ఈ తివాచీలు వాటి మృదువైన ఆకృతికి, మన్నికకు అంతర్జాతీయంగా పేరుగాంచాయి.

కాశ్మీర్ ప్రకృతి అందాలు, చినార్ ఆకుల డిజైన్లతో రూపుదిద్దుకున్న ఈ కళాఖండం ఇరు దేశాల మధ్య మైత్రికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే ఫిలిప్పీన్స్ ప్రథమ మహిళ లీజా అరానేటా-మార్కోస్‌కు కాశ్మీరీ పష్మినా షాల్‌ను అందమైన పేపియర్-మాచే (Papier-Mache) బాక్స్‌లో ఉంచి బహుకరించారు. చాంగ్తాంగీ మేకల ఉన్ని నుంచి తయారయ్యే ఈ పష్మినా కప్పుకోవడానికి ఎంతో తేలికగా, వెచ్చగా ఉంటుంది. దీనికి జోడీగా ఇచ్చిన హస్తకళల పేపియర్-మాచే బాక్స్ కాశ్మీరీ కళాకారుల నైపుణ్యానికి అద్దం పడుతోంది.
ప్రపంచ దేశాల అధినేతలకు అరుదైన భారతీయ వస్తువులు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు రాజస్థాన్‌లోని నాద్వారాకు చెందిన గోల్డెన్ పిచ్వాయ్ పెయింటింగ్‌ను ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు. బంగారం మరియు మినరల్ వర్ణాలతో వస్త్రంపై చిత్రించే ఈ చిత్రకళలో కమలాలు, గోమాతలు, చెట్ల డిజైన్లు ఎంతో రాజసం ఉట్టిపడేలా ఉంటాయి. అలాగే జపాన్ ప్రధాని సనాయె తకైచికి వారణాసికి చెందిన రాయల్ బ్లూ బనారసి కటాన్ సిల్క్ స్టోల్‌ను సాఢేలి బాక్స్‌లో ఉంచి అందజేశారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కు జైపూర్ బ్లూ పాటరీ ఆర్టిఫాక్ట్‌ను, థాయ్ ప్రధాని ఆన్టిన్ చర్న్విరాకుల్‌కు గుజరాత్ కచ్ ప్రాంతానికి చెందిన రోగన్ ఆర్ట్ పెయింటింగ్‌ను కానుకగా ఇచ్చారు. సహజ రంగులు, కాస్టర్ ఆయిల్‌తో వేలితో గీసే ఈ రోగన్ ఆర్ట్ శతాబ్దాల చరిత్ర కలిగిన అరుదైన కళ.
ప్రత్యేక రాష్ట్రాల ప్రత్యేక కళాఖండాలు..
వియత్నాం ప్రధాని లె మిన్ హుంగ్‌కు హస్తకళా నైపుణ్యంతో తయారైన లెదర్ వాల్ హ్యాంగింగ్‌ను ప్రధాని బహుకరించారు. ఇది మన దేశ జానపద కళా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. కంబోడియా ప్రధాని హున్ మానెట్‌కు 4,000 ఏళ్ల నాటి ప్రాచీన 'లాస్ట్-వ్యాక్స్' కాస్టింగ్ పద్ధతిలో తయారైన డోక్రా ఆర్ట్‌వర్క్ బోట్‌ను అందించారు.
టిమూర్-లెస్సే ప్రధాని జనానా గుస్మావోకు గుజరాత్‌లోని ఖంభాత్ ప్రాంతానికి చెందిన జిఐ (GI) ట్యాగ్ పొందిన అగేట్ బౌల్‌ను (Agate Bowl) బహుమతిగా ఇచ్చారు. బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాహ్‌కు, మయన్మార్‌కు కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ 'బీదర్ వేర్' సిల్క్ ఇన్‌లే వాశ్‌ను అందజేశారు. నల్లటి జింక్-రాగి మిశ్రమంపై స్వచ్ఛమైన వెండితో చెక్కిన ఈ కళాఖండం దక్కన్ ప్రాంతపు లోహశిల్ప కళా వైభవానికి నిదర్శనం.
గిరిజన కళలు, చోళుల శిల్పాలకు అంతర్జాతీయ గుర్తింపు..
ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌కు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల గిరిజన తెగలకు చెందిన సాంప్రదాయ 'గోండ్ పెయింటింగ్'ను అందించారు. ప్రకృతిలోని జీవరాశులను ప్రతిబింబించే ఈ చిత్రకళ మన దేశ గిరిజన సంస్కృతికి ప్రతీక. అలాగే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు 9 నుంచి 13వ శతాబ్దాల నాటి దక్షిణ భారతదేశపు చోళ బ్రాంజ్ శిల్పాన్ని, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీమ్‌కు సుందరమైన సిల్వర్ ఉర్లీని బహుకరించారు.
లావోస్ ప్రధాని సలుంక్సే కొమ్మాసిత్‌కు జైపూర్ నైపుణ్యంతో గులాబీ రంగు క్వార్ట్జ్ రాయితో తయారు చేసిన ఏనుగు శిల్పాన్ని అందజేశారు. ఈ విధంగా ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనలో భారతదేశపు అట్టడుగు కళలను ప్రపంచ వేదికపై ఆవిష్కరించి, మన దేశ ఆర్టిసన్ల ప్రతిభకు సముచిత గౌరవం కల్పించారు.














Click it and Unblock the Notifications
