రాహుల్ గాంధీ విఫలం అయ్యారు కాబట్టే ప్రియాంకాను తీసుకొచ్చారు: బీజేపీ
రాహుల్ గాంధీ విఫలమయ్యారు కాబట్టే తెరపైకి ప్రియాంకా గాంధీని తీసుకొచ్చారని ఆరోపించింది బీజేపీ. బీజేపీ వ్యతిరేక పార్టీలు కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీని వారు తిరస్కరించారు కాబట్టి ప్రియాంకా గాంధీని తీసుకొచ్చారని బీజేపీ విమర్శించింది. రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్‌కు ఉపకరించదని భావించారాని అందుకే ప్రియాంకా గాంధీని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని కమలనాథులు విమర్శనాస్త్రాలు సంధించారు.
ప్రియాంకా గాంధీని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ అసమర్థుడు అని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందని విమర్శించారు బీజేపీ నేత సంబిత్ పాత్ర. మహాకూటమిలో పొసగలేకనే కుటుంబ కూటమిని కాంగ్రెస్ ఏర్పాటు చేస్తోందని ఎద్దేవా చేశారు. ప్రధాని చెప్పినట్లుగా లోక్‌సభ ఎన్నికలు వారసత్వానికి, పనిచేసేవారికి మధ్య జరుగుతన్న యుద్ధం అని గుర్తు చేసిన సంబిత్ పాత్ర... తప్పని పరిస్థితుల్లో గాంధీ కుటుంబం నుంచి మరొకరిని తీసుకురావాల్సి వచ్చిందన్నారు.

కాంగ్రెస్‌లో కొత్త నాయకుడు ఎవరని దేశం ప్రశ్నిస్తోందన్న సంబిత్ పాత్ర... జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఇందిరా గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సోనియాగాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీలు వారసలుగుగా వచ్చారన్నారు. ఇప్పుడు కొత్తగా ప్రియాంకాగాంధీ వచ్చారని విమర్శించారు. ఇక అన్ని నియామకాలు ఒక్క గాంధీ కుటుంబం నుంచే జరిగాయని మండిపడ్డ సంబిత్ పాత్ర కాంగ్రెస్‌కు బీజేపీకి అదే తేడా అని వెల్లడించారు.












Click it and Unblock the Notifications