చెట్టుకు కట్టేసి నిప్పంటించారు.. చికిత్స పొందుతూ సోషల్ మీడియా స్టార్ కన్నుమూత!
పంజాబ్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్ కిడ్నాప్, హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. చండీగఢ్ లో కిడ్నాప్‌కు గురై, దుండగుల చేతిలో దారుణమైన దాడిని ఎదుర్కొన్న ఆమె.. దాదాపు రెండు నెలల పాటు ఆస్పత్రిలో మరణంతో పోరాడి ఎట్టకేలకు తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గాయాలు, కాలిన గాయాల కారణంగా చండీగఢ్ లోని పీజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆగస్టు 26న కన్నుమూశారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
అసలేం జరిగిందంటే?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జులై 3న చండీగఢ్‌లోని రద్దీగా ఉండే సెక్టార్ 34 ప్రాంతం నుంచి మంజీత్ కౌర్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. ఆమెను కారులో మొరిండా ప్రాంతంలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై దారుణంగా దాడి చేసి, చేతులు కాళ్లు కట్టేసి సజీవ దహనం చేసేందుకు నిప్పంటించారు. తీవ్రగాయాలు, కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఈ దారుణానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతురాలి తల్లి కాంతా దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కిడ్నాప్, హత్య వెనుక హస్తం ఉన్నట్లు భావిస్తున్న రింకు, శుభి, పిండా అనే ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు డీఎస్పీ గుర్తిత్ కౌర్ వెల్లడించారు. ఈ కిడ్నాప్, హత్య వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఘటనా స్థలాలు, పరిసర ప్రాంతాల్లోనే సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ కేసులో నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. బాధిత కుటుంబం ప్రస్తుతం అంత్యక్రియలు, దానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఉండటంతో వారితో మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు వేచి చూస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీస్ యంత్రాంగం వెల్లడించింది.












Click it and Unblock the Notifications