ఉత్కంఠకు బ్రేక్.. రాహుల్ అమేథి నామినేషన్ ఓకే..!
అమేథి : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిస్థితి ఒకటి ప్లస్, ఒకటి మైనస్ అన్నట్లుగా తయారైంది. చౌకీదార్ చోర్ హై కామెంట్లపై సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన కొద్దిగంటల్లోనే ఆయన అమేథి నామినేషన్ కు ఆమోదముద్ర పడింది. అమేథి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ధృవ్‌లాల్ ఆయనపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ నామినేషన్ క్షుణ్ణంగా పరిశీలించేంత వరకు ఆమోదించొద్దని కోరారు.

అమేథి ఫియర్.. డౌట్ క్లియర్
లోక్ సభ ఎన్నికల కోసం దేశమంతటా బిజీబిజీగా పర్యటిస్తున్న రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఇటు అమేథి నుంచే కాకుండా అటు కేరళలోని వాయనాడ్ నుంచి బరిలో నిలిచారు. అదలావుంటే అమేథి పార్లమెంటరీ స్థానానికి రాహుల్ ఈనెల 10వ తేదీన నామినేషన్ వేశారు. అయితే ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాలు తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపిస్తూ స్వతంత్ర అభ్యర్థి ధృవ్‌లాల్ కంప్లైంట్ చేశారు. అంతేకాదు రాహుల్ నామినేషన్ తిరస్కరించాలని కోరారు.

నామినేషన్ లో తప్పులున్నాయట..!
రాహుల్ గాంధీ భారతీయుడు కాదని ఆరోపించిన ధృవ్‌లాల్.. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హుడంటూ ధ్వజమెత్తారు. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం ఉన్నట్లు అక్కడి కంపెనీ వివరాలను బట్టి తెలుస్తోందన్నారు. అంతేకాదు సదరు కంపెనీకి సంబంధించిన వివరాలను ఎలక్షన్ అఫిడవిట్‌లో రాహుల్ గాంధీ ప్రస్తావించలేదని ఆరోపణాస్త్రాలు సంధించారు.
ఆయన సమర్పించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పత్రాలలోనూ తప్పులున్నాయని పేర్కొన్నారు.

నామినేషన్ ఓకే.. గెలుపు పరిస్థితేంటో..!
RAUL VINCI పేరు గల విద్యార్హత పత్రాలు సమర్పించారని.. రాహుల్ గాంధీ పేరుతో ఆయనకు చదువుకున్న ధృవీకరణ పత్రాలు లేవంటున్నారు ధృవ్‌లాల్. అంతేకాదు రావుల్ విన్సీ, రాహుల్ గాంధీ ఒక్కరేనా.. లేదంటే వేర్వేరు వ్యక్తులా అని ప్రశ్నించారు. మొత్తానికి ధృవ్‌లాల్ అభ్యంతరాలతో రాహుల్ గాంధీ నామినేషన్ పరిశీలించడానికి గడువు తీసుకున్నారు రిటర్నింగ్ అధికారి. రాహుల్ నామినేషన్ పత్రాల పరిశీలనను సోమవారం నాటికి వాయిదా వేశారు. ఇవాళ రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు పరిశీలించి, అన్ని వివరాలు సరిగానే ఉన్నాయని తేల్చారు.
రాహుల్ గాంధీ నామినేషన్ పై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ఆయన నామినేషన్ కు ఆమోద ముద్ర లభిస్తుందా లేదంటే తిరస్కరణకు గురవుతుందా లాంటి వాదనలు సోషల్ మీడియాలో జోరుగా సాగాయి. చివరకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన నామినేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉత్కంఠకు బ్రేక్ పడింది. ఇక మే 6వ తేదీన జరిగే అమేథి పోరు ఎలా ఉండబోతుందో చూడాలి.












Click it and Unblock the Notifications