అవినీతి ప్రభుత్వం, ఓటు వెయ్యద్దు, అధికారంలోకి వస్తే, నా మాట వినండి: రాహుల్ గాంధీ!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని ముళబాగిల్ శాసన సభ నియోజక వర్గంలో శనివారం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన రాహుల్ గాంధీ ఆదివారం సాయంత్రం వరకూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అవినీతి ప్రభుత్వానికి ఓటు వెయ్యకూడదని, నామాట వినాలని రాహుల్ గాంధీ ప్రజలకు మనవి చేశారు.

ప్రత్యేక హెలికాప్టర్
శనివారం ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్న రాహుల్ గాంధీ అనంతరం హెలికాప్టర్ లో ముళబాగిల్ లోని కరుడమలె ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం కరుడమలెలోని ప్రసిద్ది చెందిన శ్రీ గణేశ దేవాలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేశారు.

దేవుడి ఆశీర్వాదం
రాహుల్ గాంధీ రాక సందర్బంగా కరుడుమలెలోని శ్రీ గణేశ దేవాలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహుల్ గాంధీతో పాటు సీఎం సిద్దరామయ్య, మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులకు ఆలయ అధికారులు శాలువాలు కప్పి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. చాల సేపు రాహుల్ గాంధీ ఆలయం ఆవరణంలో ప్రశాంతంగా గడిపారు.

రాహుల్ కు ఘనస్వాగతం
ముళబాగిల్ పట్టణంలోని వరదరాజ చిత్ర మందిరం నుంచి ప్రారంభం అయిన రాహుల్ గాంధీ రోడ్ షో అంబేద్కర్ సర్కిల్ వరకు చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన రాహుల్ గాంధీ శాసన సభ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు.

అవినీతి ప్రభుత్వం
కర్ణాటకలో 2013కు ముందు ఉన్న బీజేపీ అవినీతి ప్రభుత్వానికి అంతేలేకుండా పోయిందని రాహుల్ గాంధీ అన్నారు. అలాంటి అవినీతి పార్టీకి మళ్లీ ఒక్క ఓటు కూడా వెయ్యరాదని, కర్ణాటకలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాకుండా మీరే చూడాలని రాహుల్ గాంధీ కార్యకర్తలకు మనవి చేశారు.

ప్రజల ప్రభుత్వం
కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేసిందని, ఆ విషయం మీఅందరికీ తెలుసని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రజల కోసం శక్తి వంచన లేకుండా పని చేసిన సీఎం సిద్దరామయ్య ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలో తీసుకురావడానికి మీరందరూ సహకరించాలని రాహుల్ గాంధీ మనవి చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం సిద్దరామయ్య, మంత్రులు డీకే. శివకుమార్. రమేష్ కుమార్, ఎంపీలు కేహెచ్. మునియప్ప, వీరప్ప మోయిలీ, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications