ముఖం చాటేసిన రాహుల్ గాంధీ ?, ప్రభుత్వం ఉన్నా పట్టించుకోలేదని అసహనం, సీఎం మాత్రం !
గత లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో గెలిచిన సీట్లను నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్న బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా సీనియర్ బీజేపీ నేతలందరినీ రంగంలోకి దింపింది. అయితే కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, యువరాజు రాహుల్ గాంధీ ఇంకా కర్ణాటకలో ఎన్నికల ప్రచార రంగంలోకి దిగకపోవడంతో ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు గుబులు మొదలైయ్యిందని తెలిసింది.
కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా రాహుల్ గాంధీ ఇంకా కర్ణాటకకు రాలేదా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కార్యకర్తలు అంటున్నారు. ఆదివారం రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్చి 16వ తేదీ నుంచి కర్ణాటక రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రావడం ఇది మూడోసారి. మైసూరులో ఆదివారం జరిగిన బీజేపీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. మంగళూరులో జరిగే రోడ్ షోలో కూడా పాల్గొననున్నారు.

అయితే కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ మాత్రం కర్ణాటకకు ఇంత వరకు రాలేదు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటికి రంగంలోకి దిగని రాహుల్ గాంధీ కొత్త వ్యూహం ఏంటి? అని అర్థం కావడం లేదని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే తన సొంత జిల్లా కలబురగి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీరికలేకుండా భారీగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తన సొంత గడ్డపై ఎన్నికల ప్రచారం చేస్తూ బీజేపీ-జేడీఎస్ కూటమి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్ షోలోలు నిర్వహించి తమ్ముడు డీకే సురేష్ ను గెలిపించాలని డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం కర్ణాటక వైపు కన్నెత్తికూడా చూడటం లేదని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
బీజేపీ -జేడీఎస్ కూటమి నాయకులు, కార్యకర్తల మధ్య అంతరాన్ని తగ్గించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగళూరులో రెండు పార్టీల నాయకులతో సమన్వయ సమావేశంతో సహా వరుస సమావేశాలను కూడా నిర్వహించారు. కర్ణాటక ఎన్నికల పరిశీలకుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ దాస్ అగర్వాల్ దాదాపు రెండు నెలలుగా బెంగళూరులో మకాం వేయడంతో మొత్తం 28 నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించి బీజేపీ హైకమాండ్ కు నివేదిక పంపిస్తున్నారు.

రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నాయకులు ఆధారపడి ఉన్నారని తెలిసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు లోక్ సభ ఎన్నికల ప్రచారం బాధ్యతలు పూర్తిగా అప్పగించినట్లు తెలుస్తోంది. మల్లికార్జున ఖార్గే బెంగళూరు, కలబురగిలో మాత్రమే పర్యటించడం మినహా మరెక్కడా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాలుపంచుకున్నట్లు కనిపించడం లేదు.
కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ హోరాహోరీగా ఎన్నికల ప్రచారంతో పోల్చితే ఈసారి లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కర్ణాటకలో రాహుల్ గాంధీ గైర్హాజరు కావడం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు కేవలం తొమ్మిది రోజుల ముందు అంటే ఏప్రిల్ 17వ తేదీన కర్ణాటకలోని కోలార్, మండ్యలో ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications