బ్యాట్ పట్టుకోలేడు కానీ ఐసీసీ ఛైర్మనా ? జై షాపై రాహుల్ పంచ్ లు..!
బీహార్ లో రెండో దశ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తొలి దశలో ఓటర్లు స్పందించిన తీరుతో అన్ని పార్టీల్లో టెన్షన్ పెరుగుతోంది. దీంతో ప్రచార పర్వంలో నేతలు ప్రత్యర్దులపై పంచ్ లతో విరుచుకుపడుతున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, ఐసీసీ ఛైర్మన్ కూడా అయిన జై షాపై విమర్శలు గుప్పించారు.
నవంబర్ 11న రెండో దశ పోలింగ్ జరిగే భాగల్పూర్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... "మీరు అదానీ, అంబానీ లేదా అమిత్ షా కొడుకు అయితేనే మీరు పెద్దగా కలలు కనగలరు. అమిత్ షా కొడుకు (జై షా)కి బ్యాట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, పరుగు తీయడం మర్చిపోండి. కానీ ఆయన క్రికెట్ చీఫ్. క్రికెట్‌లో ప్రతి దానినీ ఆయన నియంత్రిస్తాడు. ఆయన ప్రతిదీ ఎందుకు నియంత్రిస్తాడు? డబ్బు కారణంగా" అని అన్నారు.

దీంతో జైషాపై రాహుల్ విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. జై షా గతేడాది డిసెంబర్ లో ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టారు.
గతంలో ఆయన బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ క్రికెట్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2021 నుండి 2024 వరకు ఆసియా క్రికెట్ అధ్యక్ష పదవిలో ఉన్నారు. గత డిసెంబర్ లో రెండేళ్ల కాలానికి జైషా ఐసీసీ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఐసీసీ వ్యవహారాలపై బీసీసీఐకి ఉన్న పట్టు కారణంగా జైషాకు ఈ పదవి దక్కింది. ఇప్పుడు జైషా బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ వార్తల్లో నిలుస్తున్నారు. బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై జై షా స్పందించలేదు.












Click it and Unblock the Notifications