బిజెపి ఫైర్, ఇరకాటంలో కేంద్రం: రాహుల్ టార్గెట్ పిఎం?
న్యూఢిల్లీ: నేరచరితులను చట్ట సభల్లో కూర్చోబెట్టే ఆర్డినెన్స్‌ను చించివేయాలన్న ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడగా, కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడింది. ఇది ప్రభుత్వమా లేక డ్రామా కంపెనీయా అని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ముక్తాస్ అబ్బాస్ నక్వీ మండిపడ్డారు.
ఇలాంటి డ్రామాలతో కాంగ్రెసు పార్టీ తమ వైఫల్యాలను దాచి పెట్టలేదన్నారు. విధిలేని పరిస్థితిలో నష్ట నివారణ చర్యలకు కాంగ్రెసు పార్టీ సిద్ధమైందని బిజెపి రాజ్యసభ సభ్యుడు అరుణ్ జైట్లీ విమర్శించారు. ఈ ఆర్డినెన్స్‌ను తమ పార్టీ మొదటి నుండి వ్యతిరేకిస్తోందని చెప్పారు. దీనిపై సంతకం చేయవద్దని తాము రాష్ట్రపతిని కోరామన్నారు.

ఈ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెసును ప్రజలు ఛీకొడతారనే భయంతోనే రాహుల్ యూ టర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం లేదని అర్థమవుతోందని తృణమూల్ కాంగ్రెసు పార్టీ నేత సౌగతరాయ్ విమర్శించారు.
ఈ ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ ఇప్పుడేం చెబుతారని బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. కాంగ్రెసు ఒకే అంశంపై వివిధ రకాలుగా స్పందిస్తోందని, ఆర్డినెన్స్‌ను తెచ్చింది కాంగ్రెసు పార్టీయేనని బిజెపి అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి అన్నారు.
మరోవైపు రాహుల్ వ్యాఖ్యలతో కేంద్రం ఇక్కట్లలో పడినట్లుగా కనిపిస్తోంది. ఆయన వ్యాఖ్యల పైన స్పందించేందుకు పలువురు కేంద్రమంత్రులు నిరాకరించారు. ఆర్టినెన్స్‌ను వ్యతిరేకించే హక్కు రాహుల్ గాంధీకి ఉందని శశి థరూర్ అన్నారు.
నేర చరితులైన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడకుండా ప్రభుత్వం తీసుకు వచ్చే ఆర్డినెన్స్ అర్థరహితమని, అది నాన్సెన్స్ అని రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా, ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను టార్గెట్ చేశారా అనే చర్చ కూడా సాగుతోంది. ఆర్టినెన్స్ పై రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని హతాశులయ్యారని, ఆయన విదేశాల నుండి తిరిగి వచ్చాక పరిస్థితిని చక్కదిద్దుతారని పిఎంవో ప్రకటించింది.












Click it and Unblock the Notifications