పదివేల రూపాయలు విలువచేసే చెట్టుకు కోటి ఇచ్చిన రైల్వే.. ఇంట్రెస్టింగ్ కేసు!
వార్ధా-యవత్మాల్-పుసాద్-నాందేడ్ రైల్వే ప్రాజెక్ట్ కోసం రైల్వే ఒక చెట్టుకు కోటి రూపాయల పరిహారం ఇవ్వడం, ఆ తరువాత కోర్టును ఆశ్రయించడం ఆసక్తికరమైన కేసుగా మారింది. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో రైల్వే ప్రాజెక్టు కోసం చేసిన భూసేకరణ కేసు ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
పరిహారం కోసం కోర్టును ఆశ్రయించిన రైతు
ఈ రైల్వే ప్రాజెక్టు కోసం ఖర్షి గ్రామానికి చెందిన కేశవ్ తుకారాం షిండే అనే రైతుకు చెందిన భూమిని ప్రభుత్వం సేకరించింది. అయితే 2018 లోనే ఆయనకు భూమికి సంబంధించిన పరిహారం ఇచ్చింది రైల్వే. ఆ భూమిలో ఉన్న చెట్లు ఇతర ఆస్తులకు సంబంధించిన పరిహారం ఆలస్యం కావడంతో, సదరు రైతు హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఆదేశాలతో ఆ చెట్టుకు కోటి పరిహారం ఇచ్చిన రైల్వే
అధికారిక రికార్డుల్లో ఆ చెట్టు విలువైన ఎర్రచందనం చెట్టు అని పేర్కొన్నారు. దీని ఆధారంగా హైకోర్టు రైల్వేకు ఆ చెట్టు కోసం కోటి రూపాయల తాత్కాలిక పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రైల్వే ఆ చెట్టుకు కోటి రూపాయల పరిహారం చెల్లించింది.
పదివేల విలువగల చెట్టుకు కోటి పరిహారం ఇచ్చిన రైల్వే
అయితే తాజాగా పుసాద్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆ చెట్టుపై శాస్త్రీయ పరీక్షల కోసం బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీని సంప్రదించారు. ఈ చెట్టుకు పరీక్ష నిర్వహించగా ఆ చెట్టు బిజసల్ అని, ఇది ఒక రకమైన కలప చెట్టుగా తేలింది. దీని విలువ కేవలం 10వేల 981 రూపాయలు ఉంటుందని లెక్క కట్టారు.
రైతు తప్పేమీ లేదన్న రైతు తరపు న్యాయవాది
దీంతో ఖంగు తిన్న రైల్వే మళ్లీ తాము రైతుకు చెల్లించిన కోటి రూపాయలు తిరిగి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు.బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ లో అప్పీల్ చేసుకున్న రైల్వే అధికారుల కేసుపైన షిండే కుటుంబం తరఫున న్యాయవాది అంజన రౌత్ నార్వడే వాదించారు. తమ క్లైంట్ కోటి రూపాయలు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని, రైతు ఎటువంటి తప్పు చేయలేదని ఆమె పేర్కొన్నారు.
రైతుకిచ్చిన కోటి పరిహారం తిరిగి ఇవ్వాలని రైల్వే కోర్టుకు
ప్రభుత్వ అధికారులే ముందుగా ఆ చెట్టును ఎర్రచందనం చెట్టు అని ధ్రువీకరించారు అని, ఈ గందరగోళానికి ప్రభుత్వ అధికారుల తప్పిదాలే కారణమని షిండే కుటుంబం తరపున వాదించిన న్యాయవాది పేర్కొన్నారు. ఇక ఈ చెట్టు పరిహారం వివాదం 2014 ప్రారంభం కాగా ఇంకా కొనసాగుతూనే ఉంది. షిండే కుటుంబం పరిహారం కోసం కలెక్టర్, అటవీ శాఖ, రైల్వే, నీటిపారుదల శాఖ వంటి వివిధ అధికారులను సంప్రదించింది. ఇక కోర్టు ఆదేశాలతో కోటి ఇచ్చిన రైల్వే ఇప్పుడు వీరికి ఇచ్చిన కోటి పరిహారం కోసం కోర్టును ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications