ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 18 మంది మృతి ఘటన వెనుక: కమిటీ ఇదే
New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అత్యంత విషాదకర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ సంభవించిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. మరో నలుగురు చిన్న పిల్లలు. మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించడానికి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరి వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ అది. శనివారం రాత్రి 9:55 నిమిషానికి 15వ నంబర్ ప్లాట్‌ఫామ్ మీదికి రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడ్డారు. సీటు కోసం పోటీ పడ్డారు.

పాట్నాకు బయలుదేరి వెళ్లాల్సిన మగధ్ ఎక్స్‌ప్రెస్ 14వ నంబర్ ప్లాట్‌ఫామ్, ఢిల్లీ- జమ్మూ నార్త్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ 15వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై వేచివున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుందని నార్తర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ హిమాన్షు ఉపాధ్యాయ తెలిపారు. ఈ రెండు రైళ్లను ఎక్కడానికి కొందరు ప్రయాణికులు మెట్లు దిగి వస్తోన్న సమయంలో జారిపడటం తొక్కిసలాటకు కారణమైందని అన్నారు.
ఈ తొక్కిసలాట ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. 60 మందికి పైగా గాయపడ్డారు. వారిని లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రులకు తరలించారు. చికిత్స అందిస్తోన్నారు. మృతుల సంఖ్యను ఢిల్లీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
దీని పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.
సమగ్ర విచారణ జరిపించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఇద్దరు సభ్యుల కమిటీని నియమించింది. అత్యున్నత స్థాయి అధికారులతో కూడిన కమిటీ ఇది. నార్తర్న్ రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ దేవ్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ పంకజ్ గంగ్వార్ పేర్లను ప్రకటించింది.
ఈ కమిటీ పని మొదలు పెట్టింది కూడా. ప్రమాదం సంభవించడానికి గంట ముందు, ఆ తరువాత న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీలన్నింటినీ తమకు అందజేయాలని ఆదేశించింది. ప్లాట్‌ఫామ్‌ల మీద ఉండే సీసీటీవీల్లోని ఫుటేజీలు మాత్రమే కాకుండా.. ఎంట్రన్స్ మొదలుకుని అన్ని చోట్లా ఉన్న వాటిని భద్రపర్చాలని సూచించింది.












Click it and Unblock the Notifications