డిస్కౌంట్ ను ప్రకటించిన రైల్వే: టికెట్ ఛార్జీలో భారీ తగ్గింపు- సవాలక్ష కండిషన్లూ
శ్రావణమాసం రాకతో పండగ సీజన్ ఆరంభమైంది. ఈ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

ఈ క్రమంలో- మరో ప్రకటన చేశారు. పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నివారించడానికి.. ఓ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికింద- అక్టోబర్ 13 నుండి రౌండ్ ట్రిప్ టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు తిరుగు ప్రయాణం బేస్ ఛార్జీపై 20 శాతం రాయితీ లభిస్తుంది.
ఈ పథకం అక్టోబర్ 13 నుండి 26.. మళ్లీ నవంబర్ 17 నుండి డిసెంబర్ 1 మధ్య ప్రయాణాల సాగించే వారికి వర్తిస్తుంది. అక్టోబర్ 21వ తేదీన దీపావళి, అదే నెల 28న ఛత్ పూజ ఉన్నందున.. పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.
పండుగల సమయంలో ఒక వైపుకు ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ పథకం ద్వారా రెండు వైపులా రైళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ ఉద్దేశం. దీనివల్ల ప్రత్యేక రైళ్లకు కూడా బుకింగ్ ఆశించిన స్థాయిలో ఉంటుందని భావిస్తోంది.
- టికెట్ పై రాయితీని పొందాలనుకునే ప్రయాణికులు.. రౌండ్ ది జర్నీ అంటే అప్ అండ్ డౌన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గమ్యస్థానాలు చేరడానికి తీసుకోవాల్సిన టికెట్ ద్వారా కనెక్టింగ్ జర్నీ ఫీచర్ ను ఉపయోగించి రిటర్న్ టిక్కెట్ ను కూడా బుక్ చేసుకోవాలి. అప్పుడే ఈ 20 శాతం రాయితీ వర్తిస్తుంది.
- ఉదాహరణకు హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి టిక్కెట్ బుక్ చేస్తే.. తిరిగి వచ్చే టిక్కెట్ కూడా విశాఖపట్నం నుండి హైదరాబాద్ వరకు ఉండాలి. పాయింట్ టు పాయింట్ అంటే.. ప్రయాణ ప్రారంభ, గమ్య స్థానాలు రెండూ ఒకటే ఉండాలి.
- ఈ ఆఫర్‌ను పొందాలంటే, అప్ అండ్ డౌన్ టిక్కెట్ల బుకింగ్ రెండూ కూడా ఒకే పద్ధతిలో ఉండాలి. అంటే.. ఒక టికెట్ ను ఆన్ లైన్ ద్వారా మరో టికెట్ ను రిజర్వేషన్ కౌంటర్ లో బుక్ చేసుకుంటే వర్తించదు. అటు ఆన్ లైన్ లేదా.. కౌంటర్ బుకింగ్ రెండూ ఒకటే విధంగా ఉంటేనే డిస్కౌంట్ పొందవచ్చు.
- ఈ పథకం కింద బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఎటువంటి రీఫండ్ ఉండదు.
- ఈ పథకం ఫ్లెక్సి-ఫేర్ లేని రైళ్లతో సహా అన్ని తరగతులు, రైళ్లు, ప్రత్యేక రైళ్లకు కూడా వర్తిస్తుంది. ఈ టిక్కెట్లపై ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదు.
- జర్నీ తేదీని అటు ఇటుగా మార్చుకునే వెసలుబాటు ఉండదని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications