కోరమాండల్ ప్రమాదం: రూ.10 లక్షల రైల్వే బీమాకు డిమాండ్: మొబైల్ యాప్‌తో సులువుగా అప్లై
భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. 290కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. హౌరా- చెన్నై మార్గంలో పట్టాల పునరుద్ధరణ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వాటిని స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు.
ఈ దుర్ఘటన తరువాత రైల్వే ప్రమాద బీమాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రయాణికులు పెద్ద ఎత్తున ఈ ఇన్సూరెన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. 35 పైసల ప్రీమియంతో 10 లక్షల రూపాయల ప్రమాద బీమాను అందించే స్కీం ఇది. సాధారణంగా పౌర విమానయాన సంస్థలు ఇలాంటి ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను అందజేస్తోన్నాయి. రైల్వేలు కూడా దీన్ని ప్రవేశపెట్టినప్పటికీ- ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువ.

తాజాగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఉదంతం తరువాత ప్రయాణికులు రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను రిజిస్టర్ చేసుకుంటోన్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బీమా రక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. భారతీయ పౌరులు మాత్రమే దీనికి అర్హులు. 10 లక్షల రూపాయలను అందజేసే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందాలనుకునే ప్రయాణికులు- రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకుంటున్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆ వెంటనే ప్రీమియం మొత్తం ఆటోమేటిక్‌గా టికెట్ ధరకు యాడ్ అవుతుంది. భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ వంటి బీమా కంపెనీల నుండి నేరుగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ అందుతుంది. రిజిస్టర్డ్ ఇమెయిల్‌కు పాలసీ సమాచారాన్ని బీమా కంపెనీలు పంపిస్తాయి. నామినేషన్ వివరాలను పూరించడానికి అవసరమైన లింక్ కూడా అదే ఎస్ఎంఎస్‌లో ఉంటుంది.
ఏసీ, నాన్ ఏసీ తరగతులతో సహా రైలు ప్రయాణికులందరికీ ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. 35 పైసల నామమాత్రపు ప్రీమియంతో ఐఆర్‌సీటీసీ ఈ ట్రావెల్ బీమా పాలసీని అందిస్తుంది. పాలసీని తీసుకున్న ప్రయాణీకులు తమ రైలు ప్రయాణంలో విలువైన వస్తువులు, లేదా లగేజీని పోగొట్టుకుంటే పరిహారం కూడా పొందవచ్చు. దురదృష్టశావత్తు ప్రమాదానికి గురై మరణం సంభవించడం, శాశ్వత అంగవైకల్యం, ఆసుపత్రి పాలైనప్పుడు బీమా పాలసీ 10 లక్షల రూపాయల వరకు కవరేజీ ఆ ప్రయాణికుడికి లభిస్తుంది.
రైలు ప్రమాదానికి గురైన నాలుగు నెలల్లో ప్రయాణికులు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. నామినీ లింక్‌ను తప్పనిసరిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది ప్రయాణికుడికి. నామినీ ఫారాన్ని భర్తీ చేయడం వల్ల బీమా మొత్తం ఎవరికి చెందాలనే విషయం మీద స్పష్టత ఏర్పడుతుంది. పాక్షిక అంగవైకల్యానికి ఏడున్నర లక్షల రూపాయలు, స్వల్ప గాయాలకు రెండు లక్షల రూపాయల మొత్తాన్ని బీమా కంపెనీ ఆసుపత్రి ఖర్చులుగా విడుదల చేస్తుంది.












Click it and Unblock the Notifications