వందే భారత్ పట్టాలకు ఫెన్సింగ్: రైల్వే సంచలన నిర్ణయం: 620 కి.మీ. పొడవు..!!
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ఆట్టహాసంగా జెండా ఊపి ప్రారంభించిన రైళ్లు- వందేభారత్ ఎక్స్‌ప్రెస్. గత ఏడాది ఏడు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారాయన. ఇదివరకు న్యూఢిల్లీ-వారణాశి, న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా స్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలెక్కింది. మూడో ఎక్స్‌ప్రెస్ గాంధీనగర్-ముంబై సెంట్రల్ మధ్య అందుబాటులోకి వచ్చింది. వందేభారత్ ప్రాజెక్ట్‌లో ఇది మూడో రైలు అది. గాంధీనగర్ దాటుకుంటే అహ్మదాబాద్, వడోదర, సూరత్ మధ్య మాత్రమే ఈ రైలు హాల్ట్ సౌకర్యం ఉంది.
పట్టాలెక్కిన కొద్ది రోజులకే ఈ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని వట్వా-మణినగర్ స్టేషన్ల మధ్య- పట్టాలపైకి వచ్చిన పశువుల మందను ఢీకొట్టిందీ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్. దీనితో ముందు రైలు ముందుభాగం దెబ్బతిన్నది. కుడి భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ముందుభాగం మొత్తం ఊడి చేతికొచ్చింది. వేగంగా ఢీ కొట్టడంతో పెద్దగా కుదుపులకు లోనైందీ రైలు. భారీగా శబ్దం చేస్తూ నిలిచిపోయింది.

ఆ తరువాత కూడా అలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటూ వచ్చాయి. రైలు షేపులు మారిన సందర్భాలు చాలా చోటు చేసుకున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. గాంధీ నగర్- ముంబై మధ్య 620 కిలో మీటర్ల రైల్వే ట్రాక్ పొడవునా ప్రత్యేకంగా ఫెన్సింగ్ వేయనున్నారు. ఈ పనులను మొదలు పెట్టారు కూడా.
వడోదర డివిజన్ పరిధిలోని అంక్లేశ్వర్-భరూచ్ సెక్షన్‌లో రద్దీగా ఉండే మార్గంలో మెటల్ బీమ్ ఫెన్సింగ్ ఏర్పాటు పనులు ప్రారంభం అయ్యాయి. శరవేగంగా కొనసాగుతున్నాయి. పశువుల మంద రైల్వే పట్టాల మీదికి రాకుండా అడ్డుకోవడానికే ఈ ఫెన్సింగ్ వేస్తోన్నామని, అయిదారు నెలల్లో పూర్తి చేస్తామని పశ్చిమ రైల్వే ముఖ్య ప్రజా వ్యవహారాల అధికారి సుమిత్ ఠాకూర్ తెలిపారు. దీనికోసం 246 కోట్ల రూపాయలను వ్యయం చేయనున్నామని చెప్పారు.
ఫెన్సింగ్ కోసం కాంక్రీట్ గోడలకు బదులుగా ఉక్కుతో తయారు చేసిన షీల్డులను ఉపయోగిస్తోన్నారు. దీనివల్ల పనులు వేగంగా పూర్తవుతాయని సుమిత్ ఠాకుర్ చెప్పారు. ఇలాంటి ఫెన్సింగ్‌లను జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వే లపై ఏర్పాటు చేయడం సహజమేనని, రైల్వే ట్రాక్ పొడవునా దీన్ని వేయబోతోండటం ఇదే తొలిసారిగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో వాహనాలు, పాదచారులకు రక్షణ కల్పించడానికి ఫెన్సింగ్ వేస్తోంటారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications