రాజకీయాల్లోకి రజనీకాంత్: తేల్చేసిన సోదరుడు
చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారానికి మరోసారి తెర పడింది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు చెలరేగడం వాటిని ఖండించడం పరిపాటిగా మారింది. తాజాగా సోమవారంనాడు ఆయన సోదరుడు సత్యనారాయణ ఆ విషయాన్ని తేల్చేశారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని ఆయన సోదరుడు సత్యనారాయణ మరోమారు తేల్చి చెప్పారు. రామనాధపురం జిల్లా రామేశ్వరంలో ప్రసిద్ధిచెందిన రామనాధస్వామి ఆలయానికి సోమవారం ఉదయం రజనీ సోదరుడు సత్యనారాయణ కుటుంబసభ్యులతో వెళ్లారు.

స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరి సమస్యకు శాంతియుత పరిష్కారం కావాలని కోరుతూ కలశాభిషేకం పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
తమ సోదరుడు రజనీకాంత్ చిత్ర పరిశ్రమకే అంకితమయ్యారని, ఆయన ఎప్పటికీ రాజకీయాల్లోకి రాబోరన్నారు. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారని ఆయన చెప్పారు.. రజనీకాంత్ '2.ఓ' చిత్రాన్ని వేగంగా పూర్తిచేసే పనుల్లో తీరిక లేకుండా ఉన్నారని సత్యనారాయణ తెలిపారు.












Click it and Unblock the Notifications