ముక్కుతో టైపింగ్.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి స్మిత్ చాంగెలా
రాజ్‌కోట్: అంగవైకల్యాన్ని అధిగమించి తానెంటో నిరూపించుకున్నాడు గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌కు చెందిన స్మిత్ చాంగెలా. అతడు చిన్నప్పటి నుంచి న్యూరోపతితో బాధపడుతున్నాడు. అయితే, తనకున్న బలహీనతలను జయించి తన సంకల్ప బలంతో సరికొత్త రికార్డు సృష్టించాడు. ముక్కుతోనే ఫోన్‌లోటైప్ చేస్తూ.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. తనకున్న వైకల్యాన్ని బలహీనతగా భావించకుండా అనుకున్నది సాధించాడు స్మిత్.
రాజ్‌కోట్‌లో నివాసం ఉండే స్మిత్ చాంగెలా.. చిన్నప్పటి నుంచి నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. దీని కారణంగా అతడు మొబైల్ ఫోన్‌లో చేత్తో టైప్ చేస్తుంటే.. నొప్పి ఎక్కువగా ఉండేది.. దీంతో కరోనా లాక్‌డౌన్ సమయంలో అతడు ముక్కుతో ఫోన్లో టైపింగ్ చేయడం ప్రారంభించాడు. మొదట్లో స్మిత్ కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. ఇప్పుడు వేగంగా టైపింగ్ చేస్తున్నాడు.

ఈనేపథ్యంలోనే ముక్కుతో ఫోన్లో వేగంగా టైప్ చేస్తూ ఇండియా బుక్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు స్మిత్ చాంగెలా. ఒక్క నిమిషంలోనే 151 అక్షరాలు-36 పదాలు టైప్ చేశానని స్మిత్ తెలిపాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గుర్తింపు పత్రం కూడా అందుకున్నట్లు తెలిపాడు.
తనలాంటి దివ్యాంగ యువకులు దేశంలో ఎంతో మంది ఉన్నారని, వారు కూడా జీవితంలో ఎక్కడో ఒక చోట ఒత్తిడికి లోనవుతారని చెప్పాడు. అప్పుడు వారేం పనిచేయలేక బాధపడుతుంటారు. అలా కాకుండా ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలని స్మిత్ చాంగెలా పిలుపునిచ్చాడు. వారంతా కూడా వినూత్నంగా ఆలోచించి విజయం సాధించాలన్నాడు. కాగా, ప్రస్తుతం బీకాం చదువుతున్న స్మిత్ చాంగెలా.. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. స్మిత్ సాధించిన విజయం పట్ల ఆయన కుటుంబసభ్యులతోపాటు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications