ప్రతిపక్ష సభ్యుల తీరు పట్ల వెంకయ్య నాయుడి కంటతండి: విలువలు ధ్వంసం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన బిగ్ హ్యాకింగ్ స్కాండల్ పెగాసస్ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలను అట్టుడికింపజేస్తోంది అధికార ఎన్డీఏ కూటమిని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష సభ్యులు పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ స్కాండల్ వ్యవహారాన్ని అస్త్రంగా మార్చుకున్నారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రతిపక్ష నేతలు, కేంద్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం అధికారులు.. పలువురు ఐఎఎస్ అధికారులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ కావడం వెనుక ఎన్డీఏ పెద్దల హస్తం ఉందని, దీనిపై చర్చించాలంటూ సభను స్తంభింపజేస్తూ వస్తోన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం నుంచే పెగాసస్ స్కాండల్ వ్యవహారాన్ని ప్రతిపక్ష సభ్యులు లేవదీస్తూ వస్తోండటం వల్ల ఒక్కరోజు కూడా సభ సజావుగా సాగలేదు. లోక్‌సభ, రాజ్యసభల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ ఉభయ సభలు కూడా పలుమార్లు సభ వాయిదా పడుతూ వచ్చాయి. సభను స్తంభింపజేయడానికి కాంగ్రెస్ సారథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఏకం అయ్యాయి. పక్కా యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకున్నాయి. దాన్ని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాయి. కీలకమైన బిల్లుల విషయంలోనూ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. ఇతర వెనుకబడిన తరగతులకు సంబంధించిన సవరణ బిల్లు విషయంలో మాత్రమే సభను నడవడానికి అవకాశం ఇచ్చాయి.

ఆ బిల్లు ఉభయ సభల్లో సజావుగా ఆమోదం పొందింది. సభ సమావేశమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు- పెగాసస్ హ్యాకింగ్ స్కాండల్‌పై చర్చించాలంటూ పట్టుబట్టడం.. సభ వాయిదా పడటం జరుగుతూ వస్తోంది. రాజ్యసభలో మంగళవారం తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. పెగాసస్‌తో పాటు రైతుల అంశం మీద ఇచ్చిన తీర్మానంపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు చేసిన డిమాండ్‌ను ఛైర్మన్ ముప్పవరపు వెంకయ్య నాయుడుె తోసి పుచ్చడంతో.. కథ మళ్లీ మొదటికి వచ్చింది. రోజూలాగే- వారు సభను స్తంభింపజేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన సమయంలోనే పెగాసస్ స్కాండల్‌కు బీజం పడిందనేది వారి వాదన.
అలాగే- దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న ఉద్యమాన్ని ప్రస్తావించారు. టేబుల్స్ పైకి ఎక్కి.. నినాదాలు చేశారు. కాగితాలను చింపి గాల్లోకి ఎగురవేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. నినాదాలతో సభను హోరెత్తింపజేశారు. వాయిదా తీర్మానంపై చర్చించడానికి వెంకయ్య నాయుడు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. వారిని శాంతింపజేయడానికి వెంకయ్య నాయుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీనితో సభను వాయిదా వేశారు.
ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే- వెంకయ్య నాయుడు మాట్లాడారు. మేధావుల సభగా పేరున్న రాజ్యసభలో మంగళవారం నాటి సంఘటనలు తనను తీవ్రంగా కలచి వేశాయని వ్యాఖ్యానించారు. రాజ్యసభ విలువలను ధ్వంసం చేసినట్టయిందని పేర్కొన్నారు. అలా మాట్లాడుతూండగానే వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్యానించారు. అనంతరం సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం సభ మళ్లీ సమావేశమైన తరువాత కూడా సజావుగా సాగడానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయనేది అనుమానమేననే అంచనాలు ఉన్నాయి. మరోవంక- లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications