రేప్ చేసి, నగ్నంగా ఊరేగించండి: ‘ఖాప్’ తీర్పు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖాప్ పంచాయతీల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దల పేరుతో ఆ మూర్ఖులు చెప్పే తీర్పులు అనేక జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజా, భాగ్‌పట్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు దళిత యువతులను అత్యాచారం చేసి, అనంతరం నగ్నంగా ఊరేగించాలంటూ పంచాయతీ పెద్దలు హుకుం జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే.. దళిత యువకుడు రవి అతడు నివాసముండే గ్రామానికి చెందిన జాట్ కులానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే పెద్దలను ఎదిరించే ధైర్యం చేయలేకపోటంతో ఆమె తమ కులానికే చెందిన అబ్బాయిని గత ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది.
కాగా, ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక, పెళ్లాడిన వ్యక్తితో కాపురం చేయలేకపోయింది. దీంతో అక్కడ ఇమడలేక సుమారు ఒక నెల తర్వాత (మార్చి నెలలో) ప్రేమికుడు రవి దగ్గరికి వచ్చేసింది. దీంతో వివాదం రాజుకుంది.

యువతి తరపు బంధువులు, గ్రామ పెద్దలు ఆగ్రహానికి గురయ్యారు. బెదిరింపులకు, వేధింపులకు దిగారు. దీంతో భయపడిపోయిన రవి, ఆ యువతి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా, రవిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించారు.
అంతటితో గ్రామ పెద్దలుగా చెప్పుకుంటున్న మూర్ఖుల ఆగ్రహం చల్లారలేదు. రవి సోదరి మీనా, ఆమె స్నేహితురాలిపై అత్యాచారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో నగ్నంగా ఊరేగించాలని తీర్పు చెప్పారు. అక్కడితో ఆగకుండా.. ఊళ్లో వారుంటున్న ఇంటిని కూడా ఆక్రమించుకున్నారు.
ఖాప్ పంచాయితీ పెద్దల హుకుంతో రవి కుటుంబం ఊరు విడిచిపెట్టి ఢిల్లీకి పారిపోయింది. ఈ క్రమంలో రవి సోదరి మీనా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఖాప్ తీర్పు నుంచి తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
తన సోదరుడిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, సీబీఐ విచారణ జరిపించాలని వేడుకుంది. దీనిపై ఉన్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని జస్టిస్ చలమేశ్వర్.. ఉత్తరప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications