ఇంతటి ఘనమైన పిలుపా! ఆగస్టు 15 'ఎట్ హోమ్' కార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా రాష్ట్రపతి భవన్‌లో ఎంతో ఘనంగా నిర్వహించే 'ఆట్ హోమ్' వేడుకల ఆహ్వాన పత్రిక ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఈ పిలుపు కేవలం వేడుకకు రమ్మనే ఆహ్వానం మాత్రమే కాదు.. భారతీయ ప్రాచీన చేనేత కళలు, జానపద సంస్కృతులు, సాంప్రదాయాల కలబోతగా రూపొందింది. దేశ నలుమూలల నుంచి సేకరించిన అత్యుత్తమ హస్తకళల ప్రాముఖ్యతను తెలుపుతూ తయారు చేసిన ఈ కార్డులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.
మూడు రంగుల వస్త్రంతో ముస్తాబు
ఈ ప్రత్యేక ఆహ్వాన పత్రికను మువ్వన్నెల రంగులతో కూడిన అందమైన వస్త్రపు కవర్‌లో తీర్చిదిద్దారు. దానిపై రాష్ట్రపతి భవన్ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ముద్రించారు. దాంతో పాటు వెదురుతో తయారు చేసిన కోస్టర్‌పై "స్వాతంత్య్ర దినోత్సవం 2026" అని చెక్కి ప్రత్యేకంగా ఉంచారు. అతిథులకు స్వాగతం పలికే తీరులోనే మన కళలకు పెద్దపీట వేశారు.

నాలుగు రాష్ట్రాల సాంప్రదాయాల 'మహేశ్వరి' శాలువా
వేడుకకు విచ్చేసే విశిష్ట అతిథులకు ప్రత్యేకంగా నేయించిన 'మహేశ్వరి' శాలువాతో స్వాగతం పలకనున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సాంప్రదాయ పట్టు, నూలు దారాలతో ఈ శాలువాను రూపొందించారు. ఇందులో మహారాష్ట్రకు చెందిన 'కర్వత్ కాఠీ' చీర అంచు, గోవా 'కుంబీ' చీర బోర్డర్, మధ్యప్రదేశ్ 'కాంగ్రా' డిజైన్, ఛత్తీస్‌గఢ్ 'చింతా చౌక్' శైలులను ఒకే చోట మేళవించడం విశేషం. నాలుగు రాష్ట్రాల చేనేత వైవిధ్యాన్ని ఈ ఒక్క శాలువాలోనే ఆవిష్కరించారు.
గోవా 'అజులేజో' టైల్స్ ప్రాశస్త్యం
పోర్చుగీస్ కాలం నాటి కళను తమదైన శైలిలో మార్చుకుని గోవా కళాకారులు తయారు చేసే 'అజులేజో' బ్లూ అండ్ వైట్ టైల్స్ గురించి కూడా ఈ కార్డుల్లో వివరించారు. గోవా గ్రామీణ జీవితం, మత్స్యకారుల జీవన విధానం, అక్కడి వృక్షజాలాన్ని ప్రతిబింబించేలా హ్యాండ్ పెయింట్ చేసిన ఈ టైల్స్ సంస్కృతికి అద్దం పడతాయి.
బస్తర్ కళాఖండాలు, పవిత్ర అడవుల ప్రాముఖ్యత
నక్సలిజం పూర్తిగా అంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి ప్రతీకగా.. ఆ ప్రాంత గిరిజన కళాకారులు ఇనుముతో చేసే నైపుణ్యమైన డిజైన్ల ఫొటోలను ఇందులో పొందుపరిచారు. ప్రకృతి, పురాణ కథల ఆధారంగా వారు తయారు చేసే ఇనుప ఉత్పత్తుల ప్రాధాన్యతను తెలిపారు. దీనికి తోడు తరతరాలుగా వస్తున్న పవిత్ర వనాల సంరక్షణ, గిరిజనుల ఆరాధ్య వృక్షమైన 'మహువా' చెట్టు ప్రాముఖ్యతను వివరిస్తూ మన పర్యావరణ పరిరక్షణ మూలాలను ఈ ఆహ్వాన పత్రిక ద్వారా చాటిచెప్పారు.




Click it and Unblock the Notifications