జైలుకెళ్తే టీ స్టాల్ నడుపుతా: రాహుల్‌కు మోడీ కౌంటర్
అహ్మదాబాద్: తనను జైలుకు పంపిస్తే అక్కడ టీ స్టాల్ నడిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అన్నారు. తనకు అధికారం ఇచ్చి ఢిల్లీకి పంపాలని మోడీ గుజరాత్ ప్రజలకు పిలుపునిచ్చారు.
అమ్రేలీలో ఈరోజు జరిగిన సభలో మోడీ మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను స్మరించుకోవాలని సూచించారు. గుజరాత్‌లో లోకాయుక్త ఉంటే మోడీ జైలుకే అన్న ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యల పైన మోడీ స్పందించారు.

రాహుల్ అబద్ధాలు చెబుతున్నారని, తమ రాష్ట్రంలో ఇప్పటికే లోకాయుక్త ఉందని స్పష్టం చేశారు. తనని జైలుకు పంపడానికి కాంగ్రెస్ అన్ని యత్నాలు చేసి విఫలమైందన్నారు. ఒకవేళ జైలుకి పంపితే అందులో టి స్టాల్ నడపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గుజరాత్‌లో 26 లోకసభ స్థానాలు ఉన్నాయి. వాటన్నింటిని కైవసం చేసుకోవాలని కమల దళం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.
మోడీ ఇటీవల కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెసు ప్రభుత్వం వెళ్లి పోయేందుకు మరికొద్ది రోజులే సమయం ఉందని, ఈ కొద్ది రోజులు తనను ఎంత సాధించాలో అంత సాధించాలని నరేంద్ర మోడీ అన్నారు.












Click it and Unblock the Notifications