కుమారస్వామి ప్రభుత్వానికి గండం... ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్న యడ్యూరప్ప
కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వంకు బీటలు వాలుతున్నాయా..? యడ్యూరప్పకు లైన్ క్లియర్ అవుతోందా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత భారీ విజయం సాధించి తిరిగి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే త్వరలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుంది అంటూ బీజేపీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు కూడా. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇది నిజం అయ్యేలా కనిపిస్తోంది.

ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
కర్నాటకలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. వెంటిలేటర్‌పై ఉన్న కుమారస్వామి ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ముందుగా విజయనగర్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ రాజీనామా చేయగా ఆవెంటనే రమేష్ జార్కిహోలీ తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు ఇచ్చారు. తన సీనియారిటీని పార్టీ గుర్తించకపోవడంతోనే తను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది
ప్రస్తుతం ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూజెర్సీలో కాలభైరేశ్వర ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన వెళ్లారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలన్నీ తాను తెలుసుకుంటున్నట్లు ట్విటర్‌లో తెలిపారు కుమారస్వామి. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని అయితే వారి కల నిజం కాదని చెప్పారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితులను కమలం పార్టీ దగ్గరుండి సమీక్షిస్తోంది. కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందా అని ఎదురుచూస్తోంది.

ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం: యడ్యూరప్ప
ఇక ప్రభుత్వం తనంతట తానే పడిపోతే బీజేపీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని అన్నారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప. అయితే తాము ప్రభుత్వాన్ని పడగొడుతాం అన్న వార్తల్లో నిజం లేదని... మళ్లీ ఎన్నికలు వస్తాయని వస్తున్న వార్తల్లో అంతకంటే నిజం లేదని యడ్యూరప్ప అన్నారు. ఆనంద్ సింగ్ రాజీనామా మీడియా ద్వారానే తెలుసుకున్నట్లు యడ్యూరప్ప చెప్పారు. ఆపరేషన్ కమలంలో భాగంగా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తాను టచ్‌లో ఉన్నట్లు యడ్యూరప్ప ఇదివరకే ప్రకటించారు. అంతేకాదు బీజేపీ త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కూడా ఆ సమయంలో జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications