ఢిల్లీలో గాలి పీల్చుకుంటే మూడు రోజుల్లోనే అనారోగ్యం ఖాయం : నితిన్ గడ్కరీ
ఢిల్లీ.. దేశ రాజధాని.. కానీ ఇప్పుడు కాలుష్య కాసారంగా మారింది. ఇక్కడి గాలి పీల్చుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు. "ఢిల్లీలో మూడు రోజులు ఉంటే అనారోగ్యం పాలవడం ఖాయం" అని ఆయన చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ముంబై, ఢిల్లీ నగరాలు రెడ్ జోన్‌లో ఉన్నాయని హెచ్చరించిన ఆయన, వైద్య పరిశోధనలను ఉటంకిస్తూ ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆయుష్షు 10 సంవత్సరాలు తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పర్యావరణం, అభివృద్ధి.. రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని గడ్కరీ నొక్కి చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థికాభివృద్ధికి ఎంత ప్రాధాన్యతనిస్తామో, పర్యావరణానికి కూడా అంతే ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించారు.

కాలుష్య నివారణకు పరిష్కార మార్గాలను వివరిస్తూ, రహదారుల నిర్మాణం ఒకటని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలే ప్రధాన కాలుష్య కారకాలుగా ఉన్నాయని, వాటికి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుతం మనం ఏటా దాదాపు రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి పరిష్కారంగా బయో ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్ వంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. రవాణా, విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ రంగాలలో ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అభివృద్ధి చెందిన దేశాల్లో లాజిస్టిక్స్ వ్యయం 12 శాతం లోపు ఉంటే, మన దేశంలో అది 16 శాతం వరకు ఉంది. 2026 చివరి నాటికి ఈ వ్యయాన్ని సింగిల్ డిజిట్‌కు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చారు.
తాజాగా విడుదలైన 'వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024' నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. టాప్ 20 నగరాల్లో 13 నగరాలు భారత్‌లోనే ఉండగా, ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల ఆయుర్దాయం 5.2 సంవత్సరాలు తగ్గుతుందని అంచనా. గత ఏడాది విడుదలైన లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయనం ప్రకారం, 2009 నుంచి 2019 వరకు భారత్‌లో ప్రతి సంవత్సరం కాలుష్య సంబంధిత వ్యాధుల కారణంగా దాదాపు 1.5 మిలియన్ల మంది మరణిస్తున్నారు.
ఢిల్లీలో కాలుష్య సమస్య కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యలలో ఒకటి. దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం, ప్రజలు, పరిశ్రమలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని గడ్కరీ పేర్కొన్నారు.
వాహనాల వినియోగాన్ని తగ్గించడం, ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం, వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం ద్వారా కాలుష్య నియంత్రణ తోడ్పడుతుంది. అంతే కాకుండా ప్రభుత్వం కూడా పర్యావరణ అనుకూల విధానాలను ప్రోత్సహించాలి, పరిశ్రమలు కాలుష్య నియంత్రణ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలి, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సి అవసరం ఉంది.












Click it and Unblock the Notifications