వామ్మో.. ఢిల్లీలో రెడ్ అలర్ట్! పేలుడుపై దర్యాప్తులో టెలిగ్రామ్ సంస్థకు లేఖ!!
దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ పాఠశాల సమీపంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈ కేసును ఉగ్రకోణంలో ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు "జస్టిస్ లీగ్ ఇండియా" అనే టెలిగ్రామ్ ఛానల్‌పై ఆరాతీస్తున్నారు. ఈ ఛానెల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని టెలిగ్రామ్ సంస్థకు లేఖ కూడా రాశారు. దీంతోపాటు సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలను సైతం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.
ఖలిస్థానీ కోణంపై దర్యాప్తు..
ఢిల్లీ పోలీసుల అనుమానాలకు బలమైన ఆధారాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా.. సీఆర్‌పీఎఫ్ పాఠశాల వద్ద బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుజేజీతో సహా పూర్తి వివరాలు "జస్టిస్ లీగ్ ఇండియా" టెలిగ్రాం ఛానల్‌లో ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, జస్టిస్ లీగ్ ఇండియా టెలిగ్రామ్ గ్రూప్‌లో.. భారత ఏజెంట్లు ఖలిస్థాన్ వేర్పాటువాదులను మట్టుబెట్టడానికి చేపట్టిన చర్యలకు ప్రతీకారంగా ఈ పేలుడు జరిపినట్లు అందులో పోస్ట్ చేసింది. 'కొందరు గూండాలతో భారత నిఘా ఏజెన్సీ మా సభ్యుల నోరుమూయించాలని చూస్తే, ప్రపంచంలో వారికంటే మూర్ఖులు ఉండరు. మేము వారికి ఎంత దగ్గరగా ఉన్నామో ఏమాత్రం ఊహించలేరు. ఏక్షణమైనా దాడి చేయగల సత్తా మా దగ్గర ఉంది. ఖలిస్థాన్ జిందాబాద్' అనే మెసేజ్ 'జస్టిస్ లీగ్ ఇండియా' పోస్టులో ఉంది. ఈ కారణంగా పేలుడు ఘటనలో ఖలిస్థానీ కోణంపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు టెలిగ్రామ్ సంస్థకు లేఖ రాసినట్లు సమాచారం.

పేలుడుతో ఢిల్లీలో హై అలర్ట్..
ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసధికారులు చెబుతున్నారు. అయితే, ఈ విషయంపై టెలిగ్రామ్ సంస్థ నుంచి సమాచారం రాలేదు. అంతేకాదు, ఈ పేలుడుకు సంబంధించి ఏ సంస్థ పేరూ బయటకు రాలేదన్నారు. అలాగే, పేలుడు ఘటన జరగడంతో ఢిల్లీలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించడంతోపాటు అధికారులు పాఠశాల సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఓ అనుమానిత వ్యక్తిని గుర్తించారు. ఆ వ్యక్తి పేలుడుకు ముందు ఆ ప్రాంతంలో సంచరించినట్లు చెబుతున్నారు. అలాగే, ఓ కవర్‌లో ఏదో చుట్టి, పేలుడు ప్రదేశంలో విసిరినట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications