నేటి నుంచి ఆగస్టు 15 వరకు ఎర్రకోట మూసివేత: ఢిల్లీలో హైఅలర్ట్
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో డ్రోన్ల దాడుల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోటలోకి ప్రవేశాలను నిలిపివేయడంతోపాటు ఆంక్షలు విధించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.
ఎర్రకోట చుట్టూ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు భద్రతా దళాలకు డ్రోన్ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జులై 21 నుంచి ఆగస్టు 15 వరకు ఎర్రకోటను మూసివేస్తున్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ఉత్తర్వులు జారీ చేసింది.

ఉగ్రదాడి జరగొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ఆగస్టు 15 వరకు ఎర్రకోటను మూసివేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బలగాలు మోహరిస్తున్నాయి.
కాగా, ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎర్రకోటను సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే ఎర్రకోట పరిసరాల్లో ఆంక్షలున్నాయి.
Recommended Video

ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల సంచారం కలకలం సృష్టిస్తోంది. జమ్మూలో డ్రోన్ల దాడులు కూడా జరిగాయి. ఈ దాడుల్లో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ.. ఆస్తి నష్టం జరిగింది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.












Click it and Unblock the Notifications