వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్‌కే ధవన్: ఇందిరాగాంధీకి 21 ఏళ్ల పాటు నీడలా నడిచిన కింగ్‌మేకర్ కాంగ్రెస్ పార్టీలో అనాథగా మిగిలిపోయారెందుకు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఇందిరా గాంధీతో ఆర్‌కే ధవన్

'ఉదయం 8 గంటల నుంచి రాత్రి పడుకునే వరకు ఇందిరా గాంధీ వెంటే ఉండేవారు ఆర్‌కే ధవన్. ఏడాదిలో 365 రోజులు ఆయన దినచర్య అదే.'

'ఒక్క రోజు కూడా ఆయన సెలవు తీసుకోలేదు. ఇల్లు, ఆఫీసు, స్వదేశీ-విదేశీ పర్యటనలు ఏదైనా ఇందిరా గాంధీ వెంట నీడలా ఆర్‌కే ధవన్ ఉండేవారు.'

ఇవన్నీ ఇందిరా గాంధీ పర్సనల్ సెక్రటరీ ఆర్‌కే ధవన్ గురించి వివిధ రచయితలు రాసిన మాటలు.

ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు?

తన జీవితంలో ఇందిరా గాంధీకి ఆర్‌కే ధవన్‌లా అత్యంత సన్నిహితుడిగా మెలిగిన వ్యక్తి మరొకరు ఉండకపోవచ్చు. బతికున్నంత కాలం ఆమెకు నీడలా ఆయన ఉన్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఇంతకంటే నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడు మరొకరు లేరని చెబుతారు. దేశంలోని పెద్దపెద్ద నాయకులు ఇందిరా గాంధీని కలవాలంటే ముందు ఆర్‌కే ధవన్‌ను కలవాల్సిందే. 'ధావన్ సాహెబ్, కాస్త మా పని చూడండి' అని అడగాల్సిందే.

'1970లలో ఆర్‌కే ధవన్ మీడియేటర్‌గా బాగా గుర్తింపు పొందారు. తన మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పార్టీ ప్రముఖులతో నేరుగా మాట్లాడేందుకు ఇందిరా గాంధీ ఇష్టపడేవారు కాదు. వారిని నమ్మేవారు కాదు. మంచి లేదా చెడు ఏదైనా ఆర్‌కే ధవన్ ద్వారానే వారికి ఇందిరా గాంధీ తెలియజేసేవారు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే ధవన్‌ను బాధ్యునిగా చేయొచ్చనేది దాని వెనుకున్న ఆలోచన.' అని 'లీడర్స్, పొలిటీయన్స్, సిటిజెన్స్: ఫిఫ్టీ ఫిగర్స్ హూ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ ఇండియాస్ పాలిటిక్స్' పుస్తకంలో రషీద్ కిద్వాయ్ రాశారు.

రషీద్ కిద్వాయ్ రాసిన పుస్తకం

21 ఏళ్లలో ఒక్క రోజూ వారాంతపు సెలవు తీసుకోలేదు

'ధవన్ జుట్టు నల్లగా ఉండేది. నూనె రాసి తలను శుభ్రంగా దువ్వుకునే వారు. ఆయన ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. ఎప్పుడూ తెల్లని బట్టలు ధరించే వారు. కానీ బూట్లు మాత్రం నల్లగా ఉండేవి. ఆయనకు వ్యక్తిగత జీవితం అంటూ లేదు.' అని ఇందిరా గాంధీ బయోగ్రఫీ పుస్తకం రాసిన కేథరిన్ ఫ్రాంక్ చెప్పుకొచ్చారు.

'ఇందిరా గాంధీ వెంట పొద్దున 8 గంటల నుంచి రాత్రి ఆమె పడుకునే వరకు తాను ఉండేవాడినని ధవన్ స్వయంగా నాతో చెప్పారు. ఏడాదిలో 365 రోజులూ ఆయనకు ఇదే దినచర్య. 1962-63 నుంచి ఆయన ఇందిరా గాంధీతో పని చేయడం మొదలు పెట్టారు. నాటి నుంచి ఒక్కసారి కూడా ధవన్ వీకాఫ్ తీసుకోలేదు. క్యాజువల్, ఎర్న్‌డ్ లీవులు లేవు. పండుగలప్పుడు కూడా సెలవు తీసుకోలేదు. ఇల్లు, ఆఫీసు, దేశీయ-విదేశీ పర్యటనలు ఎక్కడైనా సరే ఎప్పుడూ ఇందిరా గాంధీ వెంటనే నీడలా ఆయన ఉండేవారు.' అని 'ఆల్ ది ప్రైమ్ మినిస్టర్స్ మెన్' పుస్తకంలో జనార్ధన్ ఠాకూర్ ధవన్ రాశారు.

ఇందిరా గాంధీతో ఆర్‌కే ధవన్

ఆల్ ఇండియా రేడియో స్టెన్‌గ్రాఫర్‌గా మొదలై...

రాజకీయ నియామకాల నుంచి విదేశీ విధానం వరకు అన్ని విషయాల్లోనూ ఇందిరా గాంధీకి ఆర్‌కే ధవన్ సలహాలు ఇచ్చేవారని చెబుతుంటారు. ఇందిరా గాంధీ తరువాత దేశాన్ని నడిపించేది ఆయనే అనే వారు కూడా ఉన్నారు.

'నేటి పాకిస్తాన్‌లోని చిన్యోట్‌లో ధవన్ పుట్టారు. 1947 దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం దిల్లీకి శరణుకోరి వచ్చింది. ఆ తరువాత ఆల్ ఇండియా రేడియోలో స్టెన్‌గ్రాఫర్‌గా ఆయన కెరియర్‌ను ప్రారంభించారు.' అని 'మదర్ ఇండియా: ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఇందిర' అనే పుస్తకంలో ప్రణయ్ గుప్తే రాశారు.

'1962లో జరిగిన న్యూయార్క్ వరల్డ్ ఫెయిర్‌లో ఇండియన్ పెవిలియన్‌కు సారథిగా ఇందిరా గాంధీని నియమించిన నాటి నుంచి ధవన్ ఆమె కోసం పని చేయడం మొదలైంది. ఇందిరా గాంధీ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అయిన తరువాత కూడా ఆమెతో ఆయన పని చేశారు. ఇందిరా గాంధీ సీక్రెట్ వెపన్‌గా ధవన్‌ను నాటి కాంగ్రెస్ నేతలు చూసేవారు. ఆ తరువాత రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు విషయంలోనూ ధవన్ అలాగే పని చేశారు.' అని ప్రణయ్ గుప్తే తన పుస్తకంలో చెప్పుకొచ్చారు.

సంజయ్ గాంధీ

సంజయ్ గాంధీ, ధవన్‌ల జుగల్‌బందీ

ఇందిరా గాంధీ చిన్న కొడుకు సంజయ్ గాంధీ రాజకీయ ఆకాంక్షలను అందరికంటే ముందు ధవన్ గుర్తించారు.

'బ్రిటన్‌లోని రోల్స్ రాయిస్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేసి తిరిగి భారత్‌కు వచ్చిన తరువాత సంజయ్ గాంధీని కాంగ్రెస్ పార్టీలోని పెద్దపెద్ద నేతలకు పరిచయం చేయడం ప్రారంభించారు ధవన్. ఇందిరా గాంధీ వద్ద సంజయ్ గాంధీని పొగడాలని కూడా ధవన్ కొందరు నేతలకు చెప్పేవారు. కొద్ది నెలల్లోనే తన కొడుకు రాజకీయ ఆకాంక్షలను ఇందిరా గాంధీ పసిగట్టడం ప్రారంభించారు.' అని రషీద్ కిద్వాయ్ వివరించారు.

'ఎమర్జెన్సీ కాలం నాటికి ఇందిరా గాంధీకి, సంజయ్ గాంధీకి అత్యంత నమ్మకస్తునిగా మారారు ధవన్. ప్రధానమంత్రి కార్యాలయంలోగల సంజయ్ గాంధీ గదిలో ధవన్ ప్రత్యేకంగా ఒక టెలిఫోన్ పెట్టించారు. ఆ ఫోను ద్వారా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంజయ్ గాంధీ నేరుగా ఆదేశాలు, సూచనలు ఇచ్చేవారు. కానీ సంజయ్ గాంధీ ఒక రాజ్యంగేతర శక్తిగా ఎదుగుతున్న విషయాన్ని ఇందిరా గాంధీ అంచనా వేయలేక పోయారు.' అని కిద్వాయ్ రాశారు.

ఇందిరా గాంధీ మీద ఆర్‌కె ధవన్ ప్రభావం ఎలా ఉండేదో నాడు ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పని చేసిన బిషన్ టండన్ తన పుస్తకం 'పీఎంఓ డెయిరీ'లో రాసుకొచ్చారు.

'ప్రధాని మంత్రి మీద ధవన్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. 'ఇందిరా గాంధీ వద్ద ధవన్ పలుకుబడి పెరుగుతోంది. దాన్ని తగ్గించాలనుకుంటున్నాన'ని పీఎన్ ధర్ నాతో అన్నారు. కానీ ఆయన ఆ పని చేయలేక పోయారు. 'బిషన్, నేను చిత్తుగా ఓడిపోయాను. ధవన్‌కు వ్యతిరేకంగా ప్రధానమంత్రి ఒక్క మాట కూడా వినడానికి సిద్ధంగా లేరు.' అని పీఎన్ ధర్ నాతో చెప్పారు. ధవన్ ఎంత శక్తిమంతుడు అంటే, ఆయన ఫోన్ చేస్తే దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కిషన్ లేచి నిలబడి మాట్లాడేవారు.' అని బిషన్ టండన్ రాశారు.

బన్సీలాల్

ఎమర్జెన్సీలో ధవన్ పాత్ర

ఎమర్జెన్సీ విధించడానికి మూడు రోజుల ముందు నాటి రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ ఎస్‌ఎల్ ఖురానాను కేంద్రహోంశాఖ కార్యదర్శిగా నియమించేలా లాబీ చేసి విజయం సాధించారు ధవన్.

ధవన్, నాటి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఓం మెహతా, నాటి హరియాణ ముఖ్యమంత్రి బన్సీ లాల్ ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ విధించిన రాత్రి అంటే 1975 జూన్ 25న అన్ని వార్తా పత్రికల కార్యాలయాలకు కరెంటు ఆపేశారు.

కానీ ఎమర్జెన్సీ ముగిసిన తరువాత దాని నుంచి దూరంగా జరిగేందుకు ధవన్ ప్రయత్నించారు.

'ఎమర్జెన్సీ: ఏ పర్సనల్ హిస్టరీ' బుక్ రాసిన కుమీ కపూర్‌తో మాట్లాడుతూ 'ఎమర్జెన్సీ అసలు విలన్ సిద్ధార్థ్ శంకర్ రే' అని ధవన్ చెప్పారు.

కుమీ కపూర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధవన్ ఇలా చెప్పుకొచ్చారు...'షా కమిషన్ విచారణ జరుగుతున్న రోజుల్లో ఒక రోజు ఇందిరా గాంధీ వద్దకు శంకర్ రే వెళ్లారు. 'మీరు చాలా ఫిట్‌గా కనిపిస్తున్నార'ని ఆమెతో అన్నారు. 'నేను ఫిట్‌గా కనిపించేందుకు నువ్వు చాలా కష్టపడుతున్నట్లున్నావ్' అని రేతో ఇందిరా గాంధీ అన్నారు. ఆ తరువాత ఆయనతో ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు.'

ఎమర్జెన్సీ దారుణాల్లో తన పాత్ర ఏమీ లేదనీ విచారణలో శంకర్ రే చెప్పుకొచ్చారు. దానికంతా కారణం ఇందిరా గాంధీ, ఆమె కొడుకు సంజయ్ గాంధేనని ఆరోపించారు. కానీ ఇందిరా గాంధీని ఎప్పుడూ సమర్థిస్తూ వచ్చారు ధవన్. శంకర్ రే, నాటి కేంద్ర న్యాయశాఖ మంత్రి హెచ్ఆర్ గోఖలే ఇందిరా గాంధీని తప్పు దారి పట్టించారని ధవన్ అంటూ ఉండేవారు.

ఎమర్జెన్సీ తరువాత ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఓడిపోయారు. అప్పుడు ఆర్‌కే ధవన్‌ను అరెస్టు చేశారు. ఇందిరా గాంధీకి ఆయన ఎంత విశ్వాసపాత్రుడో నాడు తెలిసిందని నట్వర్ సింగ్ భావించేవారు.

'షా కమిషన్ ముందు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని చరణ్ సింగ్ చెప్పారు. లేదంటే చిక్కుల్లో పడతావని హెచ్చరించారు. కానీ నేను ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కోవడానికి సిద్ధమే కానీ ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఏమీ చెప్పనని ఆయనకు స్పష్టం చేశాను.' అని ఒక ఇంటర్వ్యూలో ధవన్ చెప్పారు.

ఆర్‌కే ధవన్

ఇందిరా గాంధీ మరణంతో అనాథగా ధవన్

ధవన్ మంచి భక్తుడు కూడా. ప్రతిరోజూ పొద్దున్నే ఇందిరా గాంధీ ఇంటికి వెళ్లే ముందే తుగ్లక్ రోడ్డులోని గుడికి ఆయన వెళ్లే వారు. ఇందిరా గాంధీ హత్య మీద విచారణ చేపట్టిన ఠక్కర్ కమిషన్ రిపోర్టులో ఆయన పేరు ప్రస్తావించిన నాటి నుంచి, ఆయనకు ఆధ్యాత్మిక చింతన మరింత ఎక్కువ అయింది. బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లోని హనుమాన్ మందిరానికి తరచూ వెళ్తుండేవారు.

'ఇందిరా గాంధీ మీద ఆమె సెక్యూరిటీ గార్డులు కాల్పులు జరిపినప్పుడు, ఆమెకు రెండు అడుగుల దూరంలోనే వెనుకే ధవన్ ఉన్నారు. అప్పుడు ధవన్‌కు బుల్లెట్లు తగలడానికి లేదంటూ కాల్పులు జరుపుతున్న గార్డుల్లో ఒకరైన బేఅంత్ సింగ్, మరొక గార్డు సత్వంత్ సింగ్‌కు చెప్పినట్లు ఆరోపణలున్నాయి. ఠక్కర్ కమిషన్ రిపోర్ట్‌ను విడుదల చేయక ముందే అందులోని కొన్ని భాగాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పబ్లిష్ అయ్యాయి. ఇందిరా గాంధీ హత్య కేసులో ధవన్‌ను అనుమానించింది ఆ రిపోర్ట్. దాంతో నాటి ప్రధాని రాజీవ్ గాంధీకి ధవన్‌కు మధ్య దూరం పెరిగింది.' అని రషీద్ కిద్వాయ్ రాశారు.

ఇందిరా గాంధీ మరణం తరువాత ధవన్ అనాథగా మారిపోయారు.

అన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ధవన్‌నే అనుమానించాయని 'ద మారీగోల్డ్ స్టోరీ' పుస్తకంలో కుమ్‌కుమ్ చడ్డా రాశారు. 'ఒకనాడు కేంద్రంలో చక్రం తిప్పి 'కింగ్ మేకర్'గా గుర్తింపు పొందిన ధవన్, ఒక్కసారిగా దిక్కులేని వానిగా అయ్యారు. ఆయనకు దగ్గరగా ఉండే వారు కూడా ధవన్‌ను కలవడం మానేశారు.' అని చడ్డా చెప్పుకొచ్చారు.

రాహుల్ గాంధీతో ఆర్‌కే ధవన్

మళ్లీ పవర్‌లోకి ఆర్‌కే ధవన్

సుమారు రెండేళ్ల తరువాత మళ్లీ ధవన్‌కు కేంద్రంలో పలుకుడి పెరిగింది. బోఫోర్స్ కుంభకోణంతోపాటు వీపీ సింగ్, అరుణ్ నెహ్రూల తిరుగుబాటుతో రాజీవ్ గాంధీ తలనొప్పులు ఎదుర్కొంటున్న సమయం అది. 1988లో రాజీవ్ గాంధీ ధవన్‌ను పిలిపించుకున్నారు. మళ్లీ ధవన్‌కు పూర్వవైభవం వచ్చింది. కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ధవన్ ఆఫీసు ముందు బారులు తీరడం ప్రారంభించారు.

రాజీవ్ గాంధీ హత్య తరువాత సోనియా గాంధీ కూడా ధవన్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. పీవీ నరసింహా రావు ఆయనను తన మంత్రి మండలిలోకి తీసుకున్నారు.

'1998 మే 15న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పీఏ సంగ్మా మాట్లాడుతూ సోనియా గాంధీ భారతీయురాలు కాదన్నారు. ఆమె విదేశీయురాలు అనే విషయాన్ని లేవనెత్తారు. ఈ వివాదంలో పీఏ సంగ్మా వెనుక శరద్ పవార్ ఉన్నారు. పీఏ సంగ్మా మాట్లాడుతూ ఉంటే ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్, అర్జున్ సింగ్, గులాం నబీ ఆజాద్ అందరూ వింటూ ఉన్నారు. కానీ సంగ్మా ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకున్న ఒకే ఒక్క వ్యక్తి ధవన్ మాత్రమే. సోనియా గాంధీ వైపు ధవన్ తిరిగి... 'మేడం, ఈ విషయంలో మేం మీ వెనుకే ఉన్నాం' అని అన్నారు.' అని కిద్వాయ్ వివరించారు.

'ధవన్ చేసిన పని సోనియా గాంధీకి బాగా నచ్చింది. మాధవ్ రావ్ సింధియా, ప్రణబ్ ముఖర్జీ, అంబికా సోనీ వంటి వారు చేయలేని పని ధవన్ చేసినందుకు ఆమె ఎంతగానో మెచ్చుకున్నారని కాంగ్రెస్ వర్గాలు నాతో చెప్పాయి.' అని కిద్వాయ్ రాశారు.

అచల మోహన్‌తో ఆర్‌కే ధవన్

74 ఏళ్ల వయసులో పెళ్లి

చివరకు ధవన్ 74 ఏళ్ల వయసులో 59 ఏళ్ల అచల మోహన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన పెళ్లి 2011లో జరిగింది.

1970ల నుంచే ధవన్, అచల మోహన్ ఒకరికొకరు తెలుసు. ఒక పైలెట్‌ను పెళ్లి చేసుకున్న ఆమె, కెనడాలో స్థిరపడ్డారు. కానీ 1990లో ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.

ఆయన 74 ఏళ్ల వయసులో ఎందుకు పెళ్లి చేసుకున్నారో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధవన్ చెప్పారు.

'ఒక రోజు నాకు బాగా జ్వరం వచ్చింది. దాంతో నన్ను అచల ఆసుపత్రిలో చేర్పించింది. కానీ నాకు ట్రీట్‌మెంట్ చేసేటప్పుడు కన్సెంట్ ఫాం మీద అచల సంతకం చేయడానికి ఆసుపత్రి సిబ్బంది ఒప్పుకోలేదు. అది నాకు ఎంతో బాధ కలిగించింది. అందుకే మా బంధాన్ని లీగల్ చేయాలని నిర్ణయించుకున్నా.' అని ధవన్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
RK Dhawan: Kingmaker who shadowed Indira Gandhi for 21 years is left an orphan in the Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X